Saturday, December 29, 2012

||"అమ్మా " అని ఆయన నన్ను పిలిచాడు || by mercy margaret 
----------------------------------------------------
1.
ఈయనెవరో ఈయన దగ్గరకి లాక్కొచ్చారు అనుకున్నా
పాపం చేసి పట్టు బడ్డాను కదా 
అందరు మగవాళ్ళ లాగే ఈయన మగమనిషైనా 
ఆ ముఖంలో ప్రశాంతత
ఆ ముఖంలో తేజస్సు

2.
నా జుట్టు పట్టుకుని ఆయన దగ్గరకి ఈడ్చుకొస్తుంటే
నేను కాదు
గాయాలు మాట్లాడుతున్నాయి నా ఒంటి మీద
నేను లేను
ఒక పాపాత్మురాలిగ మాత్రమే మిగులున్నా
ఆయన పాదాల దగ్గర

3.
అందరు అతి పరిశుద్దులుగా
ఆయన ప్రవర్తన వెలికితీయ వచ్చారు
ఆయన మాటలను ఇంక్కొన్ని ఒలికించి దైవత్వాన్ని తెలుసుకోవాలని
మగ అనుకునే వారంతా కూడి నన్ను లాకొచ్చి
-"
మోషే ధర్మ శాస్త్రం రాళ్ళతో చంపమంటుంది మరి
ఈమెను ఏం చేయమంటావ్ "-అని అడిగారు

4.
నేను ఆయన వైపు చూసా
ఆయన నా కళ్ళలోకి చూసాడు
నేను ఇవే నా చివరి క్షణాలని లెక్కించు కుంటున్నా
అప్పటికి ఆయన ఏం మాట్లాడలేదు
వంగి నేల మీద వేలుతో ఏవో రాస్తూన్నాడు

5.
పరిశుద్ధులనుకుని రాళ్ళు పట్టుకున్న చేతులవి చదివి
ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి
-"మీలో పాపం చేయని వాడు
మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు "
అలాగే నేల మీద రాస్తున్నాడు
కొద్ది సేపటికి అక్కడ ఎవ్వరు లేరు

6.
"అమ్మా " అని ఆయన నన్ను పిలిచాడు
పాపత్మురాలిగా నిలబడ్డ నాకు ఒక నిమిషం ఆ పిలుపుతో
ప్రక్షాళన జరిగింది
గుండెలో ఆయన కరుణ సింహాసనం వేసుకుంది
ఆ దయ గల మాటలు
నాకు నిజమైన ప్రేమ ఇదని చూపించాయి
లోకులకు , దైవానికి మధ్య వ్యత్యాసాన్ని చూపాయి

7.
ఇక
అప్పట్నుంచి ఎవరు నన్ను
పిలిచినా
ఆయన మాటలే చెప్తాను
నా యేసుని మాటలే చెప్తాను

8.
లోకంతో నాకు ఇక పని లేదు
ఈ వేషధారణతో/వేషదారులతో పని లేదు
అతిపరిశుద్దులనబడే వారితో పని లేదు
నేను రక్షించ బడ్డ పాపిని
ఇప్పుడు ఎప్పుడు ఆయన పాదాల దగ్గర
చోటు దక్కించుకున్న పాపిని -
--------- by Mercy Margaret (29/12/2012)---

|| మానవుల మధ్యకు మానవుడై || by Mercy Margaret
-----------------------------------------
ఆదియందు వాక్యం ఉంది
వాక్యం దేవునితో ఉంది
వాక్యమే దేవుడైయండి

కాలము సంపూర్ణమైనప్పుడు
లేఖనాలలోని ప్రవచనాల నెరవేర్పు కోసం
శరీరధారియై
మానవుల మధ్యకు మానవుడై

పాపం చేసి కోల్పోయిన మహిమను
తిరిగివ్వడానికి
లోకపాపాలన్నీ మోసుకు పోయే దేవుని గొర్రెపిల్లగా
సాత్వికంగా దిగొచ్చింది

ఇమ్మానుయేలుగ నీతో నాతో ఉండడానికి
దైవం దిగొచ్చింది
------------------------ by mercy margaret (25/12/2012)----

|| క్రీస్తు జన్మదినం || by Mercy Margaret
-------------------------------------------------
సమయం వచ్చింది 
చీకటి దాక్కోడానికి 
దేవునికి నరునికి మధ్య తెర చినగడానికి 
ప్రవచనాల నేరవేర్పుకు నాంది పలకడానికి 

పరమ సింహాసనం వదిలి
దైవం
రక్త మాంసాలు గల దేహం కోసం
జన్మపాపం కూడా అంటకుండా
కన్య గర్భంలో ప్రవేశించాడు

దైవానికి నరునికి మధ్య
ఏదేను తోటలో ఏర్పడ్డ అగాధం పూడ్చడానికి
కుమారుడు
తానే వంతెనగా మారడానికి దిగివచ్చాడు

తండ్రి కుమారుని చూసి గర్వపడుతున్నాడు
సృష్టి కర్తను పసిబాలునిగా చూసి
ఆకాశం కొత్త చుక్కతో నవ్వింది
తూరుపు దేశ జ్ఞానులతో సహా
యావత్ ప్రపంచానికి
ప్రపంచ నడిబొడ్డు వైపుకు కు దారులు వేసింది

పాపపు కటిక చీకటి హృదయాలను కమ్మి
వెలుగును సైతం మింగే సమయం
వెలుగు శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణుడుగ
ఇల కేతేంచి పాపాన్ని సాతానును
ఓడించబోయే రోజుకు తొలిమెట్టు పడినదినం

రక్షకుడు అరుణోదయ దర్శనంగా అవతరించినదినం
భూమిపైన ప్రజలందరికి వినిపించబడిన సంతోషకరమైన
సువర్తమానం
-" మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు
ఈయనే ప్రభువైన క్రీస్తు "......
ఇదే ఇదే క్రిస్మస్ పండుగదినం

క్రీస్తు జన్మదినం
కృపాసత్య సంపూర్ణుడికి ఆరాధనోత్సవం ♥
--------------- by mercy margaret (25/12/2012)-

Wednesday, December 19, 2012

లోక సంద్రంలో దిక్కు తెలియక 
ముంచెత్తుతున్న అలలకు, గాఢాంధకారానికి  భయపడి 
అయ్యా అని పిలవగానే 
శరీరధారియై సహాయానికొచ్చిన 
దైవం వాక్యం 

ఎండి  రాలిన  ఆశల ఆకులు కొట్టుకుపోతుంటే  
చిగురులు వేయలేక కృంగుతుంటే 
తనలో అంటుకట్టుకున్న
ద్రాక్షావల్లి వాక్యం 

అలసి సొమ్మసిల్లి 
ఆత్మ తృష్ణతో జీవానికై వెతుకుతుంటే  
పాపానికి బానిసైన బ్రతుకును విడిపించవచ్చి 
రక్తం ధారబోసి, సర్వాంగ కవచం స్వాతంత్ర్యం ఇచ్చిన 
రక్షణ వాక్యం  

కలుగును గాక అంటూ సృష్టిని చేసి 
సర్వం మంచిదనియెంచి సంతోషిస్తే ,
దారి తప్పిన మానవాళిని దయతో హత్తుకొనడానికి    
ఆకాశానికి భూమికి మధ్య ఎత్తబడిన ఇత్తడి సర్పంలా 
సిలువకెక్కి రక్షణనిచ్చిన 
ప్రేమ వాక్యం 

అడుగు అడుగున తోడుంటూ 
జిహ్వకు  జుంటి తేనెగా , సరి చేయు సుత్తెగా , 
తీర్చి దిద్దు అద్దంగా ,నా పాదాలకు దీపంగా 
మార్గమై సత్యమై జీవమై 
చీకటి నుండి వెలుగులోకి దాటింపగా వచ్చిన 
పరిశుద్ధ అగ్ని ,పరిశుద్ధ వర్షం  , రెండంచుల 
ఖడ్గం వాక్యం 
|| క్రిస్మస్ అనగానే || by Mercy Margaret
---------------------
క్రిస్మస్ అనగానే 
ఏం గుర్తొస్తుంది ??

నాలో నిండిన చీకటిని 
ఒక చిరు నవ్వుతో చీల్చేసి
పసి బాలుడిగా
పశుశాలలో పవళించిన
నా యేసు నాధుని
బోసినవ్వుల సూర్య కాంతి

ఎండిన మొద్దుకు చిగుర్లు మొలకెత్తిస్తూ
ఆకాశంనిండా కొత్త నక్షత్ర కాంతి నింపి
ఆకాశాన్నీ భూమిని మళ్ళీ నవ్విస్తూ
జోల పాట వినిపించే తన చూపుల కరుణ వర్షం

క్రిస్మస్ అనగానే
ఏం గుర్తొస్తుంది ??

హృదయంలో ఎండిపోయిన నదులు
తిరిగి ప్రవహింప జేసేందుకు
కడుపులో మళ్ళీ జీవ జలం
పుట్టింపవచ్చిన
సమాదానమైన జీవపు ఊట

తలనుండి అరికాలు వరకు
పచ్చిపుండ్లతో నిండిన నా శరీరాన్ని
స్వస్థపరచడానికి దెబ్బలకు సిద్ధపడ్డ
పరమ నిబంధనకై దిగివచ్చి
దేహం గా మారిన వాక్యం

క్రిస్మస్ అనగానే
ఏం గుర్తొస్తుంది ??

పాపపు జిగటగుంటలో పడి
కాళ్ళు బయటికి తీయలేని స్థితిలో ఉన్న నాకోసం
అనంతమైన ప్రేమతో తన సొగసుని సురూపాన్ని
ధారాబోసి
సిలువకెక్కి మరణించిన ప్రేమ

నను
తన పరిమళ వాసనగా చేయాలని
తానే దహనబలిగా యాగమైన
యేసుని కృప గుర్తొస్తుంది
పడిపోయిన క్షణాలని తిరిగి నిర్మిస్తా రమ్మంటూ
తను ప్రేమతో పిలిచే మెల్లని స్వరం గుర్తొస్తుంది
----------------- ( 19/12/2012 ) by mercy margaret -------

Saturday, December 8, 2012

ll నా పౌర స్థితి ll  by  mercy  margaret 
-----------------------------------------
నమ్ముతున్నా
నా దినములన్ని
ఆయన గ్రంధములో వ్రాయబడి ఉన్నవని 
ఈ లోకంలో నేను పరదేశినని
నా పౌర స్థితి పరలోకమందున్నదని
 ఇక్కడ నే  కేవలం యాత్రికురాలినని

నిర్ణయింపబడిన దినములు ముగిసిన రోజున

నా కళ్ళు మూయబడతాయని 
నా నాసికా రంద్రములగుండా ఊదిన ఆయన ఆత్మ
ఈ దేహపు గుడారాన్ని విడిచి బయటకొస్తుందని 

నేను లేని దేహాన్ని చూస్తూ

నా వాళ్ళు అనబడే వాళ్ళందరూ , కాని వాళ్ళు కూడా
ఆ దేహాలలో ఉండే ఏడుస్తుండగ 
మట్టికి మట్టై పోయే ఈ దేహాన్ని నేను మరి వింతగా 
చూస్తూ 
నేను ఎవరో అప్పుడు ఇంకా స్పష్టంగా తెలుసుకుంటానని 
దేవుని ఉద్దేశ్యం ఎలా నెరవేరిందో బేరీజు వేసుకుంటానని  

అందమైన పూలను

వదిలిన నా  డొల్ల శరీరంపై పెడతుంటే చూసి నవ్వుకుంటానని 
వెతికి వెతికి నా ఊసులన్ని చెప్పుకుంటూ
మాట్లాడుకుంటూ రోదిస్తుంటే 
నా పరమ తండ్రితో ఉండే సమయం వచ్చిందని నేను 
ఆనందిస్తానని 

ఆత్మీయ సత్యాలన్నీ తెలుపబడుతుంటే 

ఆశ్చర్య పోతానని 
నా దినములు లిక్కించుటకు  నాకు నేర్పుమని 
దావీదు 
ఎందుకన్నాడో ఇంకా బాగా అర్ధం చేసుకుంటానని 

పరదైసు వైపుకు  వెళుతూ  

భూమిని  చూస్తూ వింత వింత అనుభూతి పొందుతానని 
నా కన్నా ముందు చేరిన  వారితో 
పరలోక సత్యాలు, ఆత్మీయ లోతులు తరచి తరచి తెలుసుకుంటానని 

ఆహా ఆహా 


మేఘారూడుడై  రానున్న ప్రభువు నేదుర్కోనుట ఇంకెంత 
ధన్యతో కదా !
నాధ  ఇంకెన్నాళ్ళు అని హతసాక్షులైన పరిశుద్దుల  స్వరంతో 
స్వరం కలపడంకన్నా గొప్ప భాగ్యం ఏముంది కదా ?

ఆ అనుభవాలకై హృదయం ఎదురుచూడటం 
బహు బాగుంది  కదా..!? 

నా మనసా యెహోవాను సన్నుతించు 

నా అంతరంగమందున్న సమస్తమా ఆయన 
నామాన్ని స్తుతించు ..!!


------------------------- (8/12/12)-------------------

Friday, November 30, 2012

l l తమసోమా జ్యోతిర్గమయా l l by Mercy Margaret
--------------------------
నా హృదయం
విరిగిన ప్రమిద
దీపానికి పనికి రాను

త్రొసివేయబడి
త్రొక్కబడుతూ
రోదిస్తూ ఇలా పెంటకుప్పపై

ఒక స్వరం అడుగుతుంది

ఆ విరిగిన హృదయమే కావాలని
చెల్లా చెదురై విరిగిపడిఉన్న
హృదయ ప్రమిదను
ఆరిపోయిన ఆత్మ దీపాన్ని
మళ్లీ నేను వెలిగిస్తానని
పనికిరాదని ప్రక్కకు నెట్టిన
నిన్నే వాడుకుంటానని

ఎవరని అడిగా

పరమకుమ్మరన్నాడు
లోకానికి వెలుగును
నిన్నూ వెలిగిస్తానన్నాడు
ఉన్నపాటున
సమర్పించుకున్నా
అలాగే
నన్ను పిలుస్తున్న జీవపు వెలుగుకు
నా యేసునకు ..
---------------by Mercy Margaret (13/11/2012)-------
ll చెవి గలవాడు ll BY - Mercy Margaret
---------------------------------------------
మనుషుల మాటలేమి వింటావ్ ?
ఉప్పెక్కువైన కూరలే అవి
కుళ్ళి పోయిన పండ్లే అవి
పలహారానికి కూడా పనికి రావు


చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు
వినుగాక అని,
పదే పదే పలికిన క్రీస్తు ,ఆయన శిష్యులు
చెవులేవి వింటే బాగో
వేటిని భుజిస్తే ఆత్మకు క్షేమమో
ఖచ్చితంగా తెలిసే రాసారుగా !?
వాటిని గ్రహించే పలికారుగా !?

రెండు చెవులు గలిగి నరకంలో పడే కన్నా

ఒక చెవితో పరలోకం చేరడం మిన్న అనిన ప్రభు
మాటలు
గుర్తున్నాయా !!
నేస్తం ??

జీవం కలిగిన ఒక్క మాట

జీవాదిపతి పలికే ఒక్క మాట చాలదా !?
చనిపోయిన శవాలు సమాధి నుంచి జీవంతో లేచి రావడానికి
అంగవైకల్యం ఆమడ దూరం పరుగెత్తడానికి

క్రీస్తు మహిమ క్రీస్తుకివ్వలేని లేని

ఏ గుంపులో పడితే ఆ గుంపులో చేరి
అద్భుతాలు , ఆశ్చర్యాలంటేనే విని

దిద్దుబాటు ప్రసంగాలను దురద చెవులతో దులిపేస్తూ

ఎంత నిరీక్షణ వెనకేసుకున్నావ్ ?
పరలోకపు నిచ్చెన నీ ముందే ఉంటె
వినలేని చెవులతో ఇంకెంత దూరం పరుగెడతావ్ ?

రా ..!! ఇక చాలు

మనుషులను
మట్టి మాటలను వినడం మాను
చెవులు గలవాడు
ఆత్మ చెప్పుచున్న సంగతులను
వినును గాక ...
--------------- by mercy margaret ( 24/11/2012) -------
ll ప్రభువు నీ మార్గంలో ll by Mercy Margaret
-----------------------------------------------------
నీకోసం ఒక మేడి చెట్టు వెతుక్కో
ప్రభువు నీ దారిలో రాబోతున్నాడు
హృదయంలో

ఆత్మలో
మరుగుజ్జుగా ఉండి
ఇన్ని రోజులకి చూడాలన్న ఆశ కలిగిందిగా
ఇంక ఆలస్యం ఎందుకు ??

నీ గుండె జాగ్రత్త ఆయన నీవైపు చూస్తే

నీ కళ్ళతో ఆయన కళ్ళు కలిపినప్పుడు
ఏమవుతావ్ ??
ఆ చెట్టు మీద ఉన్నావని మర్చిపోకు అక్కడే ఉంటే
ఆయనని ఇంటికెలా ఆహ్వానిస్తావ్ ??

చూచి

పేరు పెట్టి పిలిచిన వెంటనే దిగు
నాకు తెలుసు
నాలాగే నీ కాళ్ళు వణుకుతాయని ..!!

కృప నీ వెంబడి నడుస్తున్నప్పుడు

హృదయం మండుతూ మలినం మసైయ్యేప్పుడు
బాధని కప్పుతూ
ఆయన మాటలు నిన్ను ప్రేమతో కౌగలిస్తున్నప్పుడు
ఆయన గుండెనే ఆనుకో
నిత్యత్వం నీ హృదయంలో కొచ్చి
జీవ జలపు ఊట కడుపులో పుడుతుంది
ఆయన కోసం నీ దాహాన్ని తీరుస్తూ ..

నాలా నువ్వు మార్పు చెందినప్పుడు

ఆయన పరలోకంలో విందు సిద్దం చేయిస్తాడు
నువ్వు ఆయనతో కలిసి భోజనం చేస్తావ్
అప్పుడు నన్ను అబ్రహాము కుమారుడనన్నాడు
ఇప్పుడు నిన్ను తన కుమారుడిగా చేసుకుంటాడు
ఇంకెందుకు ఆలస్యం

ఈ జక్కయ

మాటలు
విని బయల్దేరు .....!!! ప్రభువు నీ మార్గంలో
రాబోతున్నాడు..
---------------------by Mercy margaret (18/11/2012

Friday, November 2, 2012












ఆటలాడిస్తుందెవరో??
---------------------------
హారికేన్లు
టోర్నడోలని
సముద్రాన్ని, గాలిని
ఆటలాడిస్తుందెవరో??

నీలం , కత్రీనా శాండీలని
అందమైన పేర్లతో
ఆ తుఫానుల కు
ఆగక
ఆకాశాన్ని వర్షించమని
తూములు నింపి
పంపిందెవరో??

త్సునామి అనే పేరుతో
వెన్నులో
వణుకు పుట్టించిన
ఉపద్రవానికి పేరు పెట్టిన
శాస్త్రవేత్తేనా
ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటే
గుండెలు మైనపు క్రొవ్వత్తులు కావా
ఎందరికో ??

అదే అదే ఆ రోజు
నలువది పగుళ్లు నలువది రాత్రులు
ఆగకుండ కురిసిన వర్షం
సృష్టిని   జలమయం చేసిన
దేవుని ఉగ్రతా ప్రవాహం
గుర్తుందా??
నోవాహను నీతిమంతుడి కుటుంబం తప్ప
కొలతలతో ఓడ కట్టేందుకు
దేవుని స్వరం విన్న ఒక్క నీతిమంతుడి
కుటుంబం  తప్ప మిగిందేంటి??
జ్ఞానం నీ సొత్తు అనుకుంటున్న నేస్తం !?

ఇప్పుడు చెప్పు?
హారికేన్లు
టొర్నడోలు
త్సునామి అని జలప్రళయాలకి
 పేరుపెట్టే నేస్తం
ఆనాటి ప్రళయానికి ఏ పేరు పెడతావ్..??.
పెట్టగలవో లేదో కాని
రక్షణ గుర్తు ఇంద్రధనస్సు ఇంకా
సాక్ష్యం ఇస్తూ ప్రశ్నిస్తూంది చూడు
నీ జ్ఞానం దేవుని ముందెంతని ??
 


Monday, October 29, 2012

l వెండి బంగారపు బిక్ష కాదు ll by mercy margaret
--------------------------------- -------------------
1.
-" వెండి బంగారములు
మా దగ్గర లేవు "

మరి వీరి దగ్గర ఏముందో?

2.

ఇలాగే
ఇక్కడే
ఎప్పట్నుంచో
దయ జాలి బిక్షమేస్తున్న వారిని
లెక్క పెట్టుకుంటూ
కాళ్లు లేక అడుక్కున్నేవాన్ని
డబ్బులు వేయకుండా మా దగ్గరేం లేదు
అని సమాధనం ఏంటో ?

3.

అయినా బిక్ష మడిగిన వారికి
నా వైపే చూసే తీరికే ఉండదు
వీళ్లేంటో
మా తట్టూ తేరి చూడుమని నన్నే
పిలిచారు

4.

నా కుడి చేయి పట్టుకుని 
నజరేయుడైన యేసు నామమున 
లేచినడువుమని పైకి లాగితే
పాదాలు చీలమండలాలు
శక్తిని నింపుకుని
ఏండిపోయిన ఎముకలలోకి జీవం ప్రవహించి
లేడిపిల్ల లాంటి కాళ్లెవరో
తగిలించినట్టే ఉంది కొత్త కొత్తగా 

5.

నమ్మలేను నన్ను నేను
ఎగురుతున్నాను
గంతులేస్తున్నాను
నా కల్లలోంచి ఆనందం నీళ్లై ప్రవహిస్తూ
స్తుతుల దూపాన్నీ ఆయన సన్నిధిలో
వేస్తునే ఉందీ
కీర్తనల అర్చన చేస్తూనే ఉందీ 

6.

వెండి బంగారపు బిక్ష కాదు
యేసు నామిచ్చిన స్వస్తతే బిక్ష
కుంటివాడిగా జీవితాంతం ఉండిపోవలసిన నాకు
జీవితాంతం అడుక్కున్నా దొరకని బిక్ష
ఆలయం బయట నుంచి
ఆలయం లోనికి నడిచివెళ్లి లెక్కించలేని స్తుతులతో
దేవుని మహిమ పరిచే బిక్ష
జీవితాంతం నువ్వొక ఆశ్చర్యమై ఉండని
వేసిన ప్రేమ బిక్ష

7.

నిజమే
ఇంకేం కావలి ఈ సేవకులకు 

వెండి బంగారాల కన్న ఎక్కువైన
క్రీస్తు నామమే కలిగి ఉండగ
నాకు అందులో ఆశ్రయముందని

ఆహ్వానమందిచగా.. .
------------------- by Mercy Margaret ( 28/10/2012 )---------

Saturday, October 20, 2012

|| నీ మాటలకి రుచి ఉందా ?? || by -Mercy Margaret 
-----------------------------
ఇంకొకరికి వడ్డించే ముందు
ఒక్క సారి
నీవు వండిన మాటలు 
నీవే తిని చూడు

తీపి చేదుల 
రుచిని తెలిపే గ్రందులు 
ఇంకా నీ మెదడు నాలికపై బ్రతికే 
ఉన్నాయిగా 

హృదయంలో 
అభిప్రాయాలని , ఆలోచనలని
భావా లని వండేప్పుడు
ఏవేవి ఎంతెంత అవసరమో 
మంచి చెడుల పధార్ధాలు కలిపి వండే
విచక్షణ నేర్పమని
నీ ఆత్మ ప్రభోదకున్ని అడుగు 

లేకపొతే 
నష్టాల పట్టికలో నీ పేరు కూడా
చివర్న నువ్వె రాసుకోవల్సి వస్తుంది

జ్ఞాపకం వుందా??
నీ హృదయం దేనితో నిండి ఉండునో
నొరు అదే మాట్లాడును అని 
అందుకే 
మాటలకి కూడా లెక్క చెప్పాల్సిన 
రోజొకటుంది
జాగ్రత్తా....

---------------- by Mercy Margaret (20/10/2012)-------------------

Thursday, October 18, 2012

|| మరణం నుండి జీవం || by Mercy Margaret
---------------------------------------------------
చావాలని ఉందా?
దూకే స్థలం వెతుకుతున్నవా?
పరిశుద్ధ వాక్యం లోకి దూకి చూడు
చావుకి బ్రతుకుకి
అర్ధం తెలుస్తుంది
మరణం నుండి జీవం వైపుకి వెళ్లే
మెట్లు కనిపిస్తూ
ఒక మెల్లని స్వరం నీతో
మాట్లాడడం మొదలుపెడుతుంది

వాక్య ప్రవాహం జీవనది

ఆ స్థానం వైపుకు ఈదుతూ వెళ్లు
ఈతరాదు సహాయం కావాలి అంటావా?
పరవాలేదు
దూకే సాహసం చెసిన నీకు
ఈత కూడా ఆ ప్రవాహం నేర్పుతుందిలే
జీవితపు అర్ధం
బ్రతుకుకున్న ఉద్ధ్యేశం ఏంటని
లోలోతులకి నిన్ను తీసుకెల్తుందిలే

అందులో మునిగిపొయినా పర్లేదు

నిత్య జీవం ,జీవకిరీటం దొరుకుతుంది
లొకరీతిగా చచ్చి నరకం
వెళ్లడం ఎందుకు??
నిన్నే..వింటున్నవా ??

----- by Mercy Margaret (18/10/202)-----------

Wednesday, October 17, 2012

||ప్రసంగి మూడవ అధ్యాయం ||
-----------------------
తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ 
నాలో నేను ఒక మూలాన కూర్చొని 
ప్రశ్నలు  మెదడు తలుపులను కొడుతుంటే 
శబ్ధం భరించలేక 
తెరిచే ధైర్యం చేయలేక 
బలహీన పడ్డ మోకాళ్లను సరి చేసుకుని 
చెవులను ఆయన వైపు త్రిప్పినప్పుడు 
విన్న వచనం ప్రసంగి మూడవ అధ్యాయం 

ఉంది 
ప్రతి ప్రయత్నానికి ఆకాశం కింద సమయం 
పుట్టడానికి , చావడానికి 
నాటడానికి ,పెరికివేయడానికి 
గాయపరచడానికి , బాగుచేయడానికి 
కట్టడానికి , పడగొట్టడానికి
నవ్వడానికి , ఏడవడానికి 

రాళ్ళు కుప్పనూర్చడానికి , పారవేయడానికి 
కౌగలించుకోడానికి ,మానుకోడానికి 
పోగొట్టుకోడానికి ,వెదకడానికి 
దాచుకోడానికి ,పోగొట్టుకోడానికి 
చింపుకోడానికి , కుట్టడానికి  

మాట్లాడడానికి , మౌనంగా ఉండటానికి 
ప్రేమించడానికి , ద్వేషించడానికి 
యుద్ధం చేయడానికి ,సమాధాన పడడానికి 

ఉంది 
ప్రతి ప్రయత్నానికి ఆకాశం కింద సమయం

ఉంది సమయం 
అనేకానేక శాభ్దాలలోంచి ఆయన గుస గుసగా మాట్లాడునప్పుడు 
చిత్తము నీ దాసుడాలకించుచున్నాడని
పలికే సమయం .. 
సమయం లేదిప్పుడు అని వ్యాపకాలతో గడుపుతూ 
ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేసే సమయం 

అవును కాని 
మరిచిపోయేవు 
ఉంది సమయం 
బాధలోఉన్నప్పుడు  ఓదార్పునిస్తూ  ఆయన నీ ప్రక్కన నిలబడే సమయం 
నీ విశ్వాసం బలపడునప్పుడు ప్రవచనాలన్నీ నెరవేర్పు పొంది  
జీవితపు ఆవర్జా ముగిసిన రోజున  
ఆయన  ముందు  నిలబడే సమయం 
పుట్టక మునుపే దినములన్నీ ఆయన గ్రంధములో 
లిఖితములైనవని అర్ధమయ్యే సమయం ..



   



Sunday, October 14, 2012

కోడి కూత -కడ బూర
---------------------
కోడి కూసింది
ఆయన చెప్పినట్టే
తనలో ఇంకా అపనమ్మకం బ్రతికే ఉందని
ఏదో  భ్రమ అతని చుట్టుకొని భయంతో కలిసి చిక్కగా ఆ కళ్ళకి
లేపనమై
యధార్ధతని చూడనివ్వక
జరగబోతున్నచారిత్రక సంఘటనలో తానూ ఒక భాగమవుతుంటే
సూచనాత్మక పాఠాన్నినేర్పుతూ

కోడి కూసింది
నామకార్ధపు శిష్యరికం చేసావా ?అని చెంప మీద కొట్టినట్టు
ఇంకా రక్షకుని గూర్చి పూర్తిగా తెలుసుకోలేదా అని
సత్యపు కత్తితో ప్రశ్నల పోట్లు పొడుస్తున్నట్టు
అధ్బుతాలు చూసిన కళ్ళు ఇంకా బొంకడం మానేయమంటూ
కన్నీళ్ళతో హృదయం కడుక్కోమని ఆగకుండా ప్రవాహమై
ఉప్పొంగుతుంటే
ఆ కూత ఏదో కొత్త పాఠమే నేర్పుతూ

కోడి కూసింది 
యేసును సృష్టి కర్తగా ఒప్పుకుంటూ
-"ఇంకా గ్రహించని ఓ మనిషి నీ కన్నా నేనే నయమని "
కర్తవ్యాన్ని , ఉద్దేశ్యాన్ని మర్చిపోయిన  నీకు
గుర్తుచేసేందుకు ప్రభువు నాకు పురమాయించాడని

కోడి కూసింది
ఇక ఇదే  నీకు అబద్దాలకి చివరి రోజని
సత్యానికి నీకు అన్యోన్య సహవాసం మొదలని
ఒప్పుకోబోయే నీ ప్రతి అవిదేయతకు నేను ప్రత్యక్ష సాక్షి అని

కోడి కూసింది 
ప్రభు ప్రేమ ఇంకా నీపై ఎక్కువయింది చూడు అని
ఆ సిలువపై ప్రాణం పెట్టబోతున్నాడు
త్వరపడమని ఆర్ధతతో

నిన్ను మెల్లని  స్వరం అడుగుతుంది
అప్పుడు కోడి కూతతో సరిపోయింది  కాని
నేడు కడ బూరశబ్దం వినగలిగే ధైర్యం
నీకుందా అని
------------- by mercy margaret (14/0/2012)----------------------



Saturday, October 6, 2012

మెర్సి మార్గరెట్ II పనికి రానని త్రోసేయకు II
----------------------------------------------------
ఇన్ని రోజులు నిన్ను పట్టించుకోలేదు
ఏమనుకోవద్దూ..!!
ఎంటో శరీరం సుఖాన్ని అడిగింది

తీరుస్తూ వస్తున్నా

కాలి గోటికి దెబ్బ తగిలితే కంటిని పిలిచేది నొప్పి
నచ్చిన వస్త్రాలు చూసి
కప్పమనేది మేను
వాసన చూడగానే ముక్కు
నింపమనేది కడుపు
దేవుడి ముందు నిల్చుని జోడించిన చేతులు ,మోకరించి కాళ్లు
ఎలాగైనా చేసి దేహమంతా
ఆపమనేది వయసు

ఏం చేయాలి చెప్పు??
ఆకరం మారింది శరీరానిది
ఎన్ని లేపనాలు రాస్తేనేం?
ఎన్ని సబ్బులు ఒంటికి రుద్దితే నేం ?
వణుకుతున్న ఒంటిని చూసి ఇప్పుడు
నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా
వదలాల్సిందే దేహం
మట్టే కదా అని..?!

లోలోపల నువ్వు నన్ను అప్పుడప్పుడు
గద్దిస్తూనే ఉన్నావ్..
ప్రేమిస్తూనే ఉన్నావ్ ..
బుద్ది చెప్తూనే వున్నవ్ ..
మందలిస్తూ మార్గం ఇది కాదని చెప్తూనే ఉన్నావ్ ..

తోడుతూ ఉంటే చెలమలా క్రొత్తగా ఊరుతూ
నన్ను నాకు పరిచయం చేసే వాడివి
కాని ఆ నిశ్చలమైన స్థితి ఇప్పుడు క్రొత్తగా ప్రభోధ చెయమని
నీ కాళ్ల దగ్గరికొచ్చా
ఇంకా ఎంత సమయం మిగిలుందో?

సుఖ దు:ఖాల కుండలు పగలగొట్టి
అవి కూడా మట్టే అని తెలిసి
లొకంలో ఉన్నదంతా
నేత్రాశ,శరీరాశ ,జీవపు డంబం అని ఇప్పుడు అర్దమవుతుంటే
కరిగిన నేను ఇప్పుడు నేలపై పరుచుకుని ఇంకిపోతుంటే
నేల తిరిగిరా అని పిలుస్తూ నవ్వుతుంటే
వింటున్నా

" సిగ్గేస్తుంది "అనే మాటకి ఇప్పుడే అర్దం తెలిసింది
ఇప్పుడైనా కొంచెం బుద్ధినిస్తావా..
వివేచనతో కలిపి తలకి అంటుకుంటా
ఆజ్ఞలు చేతికి కట్టుకుంటా
మసక తుడిచిన కళ్లతో నిన్నే చూస్తూ
నీపాదాల దగ్గరే కూర్చుంటా
పనికి రానని త్రోసేయకు..ప్రాధేయపడుతున్నా...
----- by Mercy Margaret (6/10/2012)-----------------
-

Saturday, September 29, 2012

సామాధి బండ- సాక్ష్యపు బండ
--------------------------------
బండవెనకే సమాధి చేసారు
ప్రేమని ..
బండ పారిపొయిందే ??

* * * * *
ఏం చూసిందో ఒక్కసారి
అడిగిరా రాదు?
ఏ వేళ తన బలం ఓడిందో
కనుకొన్ని చూసి
బండ వణికి తొణికినప్పుడు
నేల సాక్షం
రాసుకొని  రారాదు !

చావు ముళ్ళు విరిచి ప్రభువు
సమాధి తెరచుకుని
బయటికొస్తుంటే
జరిగిన పరిస్థితులు  చూసి
బండ కళ్లు చెప్పే
సాక్ష్యం ఒకసారి వినిరా రాదు !!

ఆకాశం తెరుచుకొని దిగి వచ్చిన దూతలు
 పరిచర్యేం   చేశారో 
ఏమి ముచ్చటించారో
మొదటి జాము చావుని చరిచిన
చేతుల శక్తి తనవైపు
ఎలా చూసిందో పలకరించి
పాటగా రాసుకొని రారాదు !!

పునరుత్ధానం జీవం సమాధిలోకి
ప్రవహించినప్పుడు
దిక్కులన్ని పిక్కట్టిల్లి
చరిత్రని చీల్చబోయే యుగపురుషుని
 పున:స్వాగతించినప్పుడు 
జరిగిన జయ జయధ్వానాల శబ్దపు తీవ్రత
తెలుసుకొని రారాదు !!

మూడు రోజుల కావలిలో
తనలో సమాధిలో  జరిగిన సంగతులన్నీ 
అడిగి ..
రాజ ముద్ర వణుకుతూ
దైవపు శక్తిని చూసి చస్తూ 
సాక్షంగా ఉండమని తనతో చెప్పిన చివరి మాటలేవో
అడిగి రారాదు
రెండవ రాకడ సిద్దపాటుకై  నీ మోకాలు గట్టి పడిందో లేదో
ఆ బండకి చూపి రారాదు  !!

సామాధి బండగానా
సాక్ష్యపు బండగానా
ఎలా బాగుందో అడిగి నేర్చుకొని
రారాదు ..



Thursday, September 27, 2012


ఆ హస్తాలు
----------------
ఒక Basket ball
నీ చేతిలో ఉంటే $19
అదే Michael Jordan చేతిలో ఉంటే
33 million Dollars
ఎందుకు?
అది ఎవరి హస్తాల్లో ఉందో
అందుకు

ఒక baseball
నీ చేతిలో ఉంటే $6
అదే Mark McGuire చేతిలో ఉంటే
19 million Dollars
ఎందుకు?
అది ఎవరి హస్తాల్లో ఉందో
అందుకు


టెన్నిస్ రాకెట్
నీ చేతిలో ఉంటే ఎం చేస్తావు?
అదే Pete Sampras చేతిలో ఉంటే
Wimbledon Championship గెలుస్తాడు
ఎందుకు?
అది ఎవరి హస్తాల్లో ఉందో అందుకు

ఒక కర్ర నీ చేతిలో ఉంటే
జంతువులను తరుముతుంది
అదే కర్ర మోషే చేతిలో ఉంటే
సముద్రాన్ని చీల్చుతుంది
ఎందుకు ?

వడిసెల నీ చేతిలో ఉంటే
ఆడుకునే చిన్నపిల్లల వస్తువు
అదే దావీదు చేతిలో అది
గోల్యాతుని చంపే ఆయుధం
ఎందుకు?


5 రొట్టెలు 2 చేపలు నీ చేతిలో ఉంటే
నీకు మాత్రమె ఆహారం
అవే 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు
చేతిలో 5000 మందికి సరిపడ
అద్భుతం
ఎందువల్ల ?

అవన్నీ ఎవరి హస్తాల్లో ఉన్నాయో చూడు ..
అందుకు !!...

మేకులు నీ చేతిలో ఉంటే ఏ ఇళ్లు కట్టడానికో
వాడాలని ఆశిస్తా కాని
అవే మేకులు యేసయ్య చేతుల్లో ఉంటే
లోకానికి రక్షణ

అందుకే
నీ భాదలు ,కష్టాలు, ఇరుకులు ఇబ్బందులు
శోదన వేదనలు ,శ్రమలు వైఫల్యాలు ,
నష్టాలు నిట్టూర్పులు ,
ఎందుకు పనికి రాదు అనుకునే నీ జీవితం
నీతోనే
నీ చేతుల్లోనే ఉంచుకుంటే ఎం లాభం ?

అదే జీవితం
అవే పరిస్తితులు
ఆయన హస్తాల్లో పెట్టు
ఒక నూతన సృష్టి , నూతన అనుభవం
అనేకులకు ఆశీర్వాదంగా మారుస్తాయి
BY-Mercy Margaret (24/9/2012)
----------------------------------------------------
 — 

Wednesday, September 19, 2012

 MY MANUFACTURER 
-----------------------
నేస్తమా ..నేస్తమా ..
 ఆగు 
-ఎవరు మీరు ?
MANUFACTURER 

ఎవరికి 
-మీ అందరికి !

అందరికి అంటే 
-హా అందరికి! లోకమంతటికి 

అంటే దేవుడు అంటే మీరేనా ?
సజీవుడను -ఉన్నవాడను-అనువాడను 

ఎందుకిక్కడ ఉన్నారు ?
REPAIR   చేయడానికోచ్చా
ఎవరిని ?
ఇక్కడ నాకిష్టమయిన ఒకరి హృదయం 
పాడయి పోయిందని 
అంతా కోల్పోయా ఇక చావడమే ఇప్పుడు 
అనుకునే 
నా కిష్టమైన కొడుకు గురించి !
అందరు ఆ హృదయాన్ని తూట్లు పొడిచి 
వదిలేస్తే ఇక ఆ హృదయాన్నే వద్దనుకునే 
నా నేస్తం గురించి 
అనాధని చేసారని ఏడ్చే ఆ కన్నీళ్ళకు 
నేన్నున్నా నని చెప్పడానికి 

మరి ఏంటి ఆ గాయాలు ఒళ్ళంతా 
నీ వెంటే వుండి నీ పాపపు గాయాల్ని .. 
శాపపు భారాలని 
నేను భరించా  

మరి ఇప్పుడెలా కనిపిస్తున్నారు?
నువ్వు నాకు కావాలి .. 
ఇక నుంచి నా సాక్షివి గా నువ్వు ఉండబోతున్నావ్ అని 
చెప్పడానికి 
నీతో నే ఎప్పుడు నేనుండ  బోతున్నానని చెప్పడానికి 
మరణం నుంచి జీవం లోకి నన్ను ఒప్పుకున్న
వెంటనే నువ్వు దాటావని చెప్పడానికి 

 ఏంటి నాకు తెలియకుండా మోకరిల్లుతున్నా 
ఏంటి భారమంతా  పోయి హృదయం 
తేలికయిన భావన 
ఏంటి ఆగకుండా వస్తున్నా కన్నీళ్లు 
ఇది నాకే తెలియని పరివర్తన 

దేవా నా దగ్గర ఏమి లేదే నీకివ్వడానికి 
-" నీ పాడైన  హృదయం 
నీ పాడైన  పరిస్థితులు 
నీ  పాడైన  జీవితం నాకిస్తావా? 
ఎవరికీ అక్కర లేని అవే నాకు కావాలి 
నీతో పాటు కావాలి 
 
* * * * *  * * * *
 అప్పటినుంచి ఆయన నాతోనే 
తన సర్వస్వం నాకిచ్చిన -"యేసయ్య "
-----------------------------------------------------------------------
(ఆత్మ హత్య కోసం వెళ్ళిన వ్యక్తితో "ఉన్నవాడు-అనువాడు ")
------------------------------------------------------------------------


 
 

Wednesday, September 12, 2012


మాదే కులం ?-క్రైస్తవ కులం-
-----------------------------
1.
నాతో వస్తావా ?
ఒకసారి ఏదేను తోటకెల్దాం
మంచి చెడ్డల తెలివినిచ్చే
వృక్షాన్ని ప్రరీశీలించి
దాని మూలాల్లో
కులం ఉందో లేదో
చూద్దాం !

2.
ఒక్క మాటలో
భూమ్యాకాశాన్ని
సృజించిన నాడే
ఏ మట్టితో
మానవుని చేశాడో దేవుడు
ఆ నేలదే కులమో
పరిశీలించి వద్దాం

3.
ఆయన శ్వాసనే
మనలో
ఊదిన నాడు
ఆయన
ఊపిరిదేకులం ?

4.
ఆ చేతులు
మన్నును
ముట్టుకున్న నాడు
మన్ను అంటుకున్న వాని
చేతుల్లో
మనిషైన వాడిదే కులం ?

5.
నేను అనే మాట
దేవుని నుండి మనిషి వరకు
దారులేసుకొని
జారిపోయి వచ్చినపుడు
అస్తిత్వపు ఆస్థిగా
మనం అనే మాట నుండి
వేరు పడి
"నేను "-"నాది "అనే
వేర్పాటు
మాటదే కులం ?

6.
సిలువనెక్కి అభిషిక్తుడు
చిందించిన రక్తంలో
పాపమంటుకున్న దేహాలను
పరిశుద్ద పరిచే నెత్తురులో
పరిశీలించి చూడు
ఆ రక్తానిదే కులం ?

7.
ఆ రక్త ధారలో కడుగబడి
క్రైస్తవుడని
పిలిపించుకుంటూ
అవసరార్ధం
నీకెందుకు
గుర్తొస్తుందీ కులం ?

8.
నా హృదయం
అడిగిప్రశ్నల్ల్లో
నాలో జరిగిన మధనంలోంచి
తెలిసిందిదే
నాదే కులమో ?మాదే కులమో ?

9.
ఆయన శ్వాస నాలో ఉన్నందుకు
మాది " దైవ కులం "
ప్రేమ చూపి ప్రాణం పెట్టినందుకు
క్రీస్తు మాదిరి "ప్రేమ కులం "
నిజమైన నిబంధనలో
యేసు మార్గంలో
తనతో పాటు నడుస్తున్న
వారందరిది
"ప్రేమ కులం "- "సేవ కులం "


BY-Mercy Margaret ( 9/9/2012)
( క్రై స్త వులను  ఉద్దేశించి రాసుకున్నదే )
 

Monday, August 27, 2012

Mercy Margaret ll నిష్కళంకమైన ప్రేమll
---------------------------------------------
 1.
ఆమె 
బండసందులో ఎగురు పావురం 
పేట బీటల నాశ్రయించి 
ఎప్పుడూ  
తను వేసుకున్న కంచెలోనే 
కట్టుకున్న ఒంటరి కోటలోనే 
దాక్కునే పావురం 
2.
అతడు 
అడవి వృక్షములలో జల్దరు వృక్షం 
కొండలమీద నుంచి ఎగసిదాటుతూ
మెట్టల మీద నుంచి 
గంతులు వేస్తూ పరుగెత్తి వచ్చే 
లేడి పిల్ల 
3.
ఆ 
బండసందు దగ్గర నిల్చొని 
ఆమెను 
నా పావురమా 
నీ స్వరం మధురం ,
నీ ముఖము మనోహరం 
"నీ ప్రేమగా" మారాలని వచ్చానిఅని 
పిలుస్తూ తను 
4.
బెదురు  చూపులతో
భంగపడి ,మోసపోయి 
గుండె నిండా గాయాలతో 
ఏడ్చి ఏడ్చి గుంతలు పడ్డ కళ్ళతో 
బొంగురు పోయిన గొంతుతో 
ఆ బండ సందులో 
మూల్గుతూ ఆమె 
5.
ఆ మాటకు 
స్పందిస్తూ ఆశ్చర్యంగా 
అతని కళ్ళలోకి చూసింది 
6.
సప్త సముద్రాలకన్న  
అనంతమైన ప్రేమ నిండి 
తన కోసం ప్రాణం ఇవ్వగల భద్రత 
ఆ బాహువుల్లో కనుగొని 
7.
తన మురికి గతాన్నంతా 
మాటల హిస్సోపుతో ప్రేమగా పవిత్రం చేస్తూ 
లోకపు దృష్టి ,చెవులు కాకుండా 
దైవాత్మతో 

8.
అతడు 
ఆమె స్వరాన్ని పవిత్రమైన ఆలాపనగా 
భీతిల్లి గాయపడ్డ ఆమె హృదయాన్ని 
మనోహరమైన ముఖంగా 
ఆప్యాయంగా 
పిలుపుతోనే మాటల కౌగిలిస్తుంటే 
9.
ఏం చేయగలదు 
ఆ అద్వితీయ ప్రేమ కోసం 
కళంకమైన తన ప్రేమను 
నిష్కళంకమైనదిగా మార్చి 
అపవిత్ర మడుగులు ,మేడలనుండి 
పవిత్రమైన తన వక్షస్థలాన్ని ఆశ్రయంగా ఇస్తుంటే 
కృతజ్ఞత పూర్వకంగా 
కన్నీటి నీరాజనాలు 
రాలుస్తూ 
అతని పాదాల దగ్గర వ్రాలింది 
10.
ఇప్పుడు అతనే 
బండ సందు 
పేట బీటలు అని 
హృదయాన్ని తనకు అర్పిస్తూ 
ఆమె  
నిత్యమైన ప్రేమను అనుభవించబోతూ

Thursday, August 23, 2012


జనాభా లెక్కలో ఒక దాన్ని
---------------------------

నేను పుట్టినప్పుడు
తలితండ్రుల మొహాల్లొ
సంతోషం గురించి
వాళ్ళు చెప్పేప్పుడు వింటుంటే
నా కళ్ళలో ఏవో దీపాలు వెలిగిపొతాయి

సంవత్సరం సంవత్సరం
మారి పోతున్న
నా గురించి నేను ఆలోచిస్తుంటే
ఇసుక లొతుళ్ళోకి కాలు దిగబడి
మళ్ళీ పైకి తీసినట్టు
ప్రాణం ఎవో ఒత్తిళ్ళకి లోనై
వెంటనే
కొద్ది సేపు శ్వాస తీసుకున్నట్టు
అనిపిస్తుంది

జీవితాన్ని సముద్రం చేసుకొని
తీరంలో పసిపాపలా
ఒళ్ళో ఇసుక నింపుకుని పిచ్చుక గూళ్ళు కడుతూ
ఒక్కో గూడుతో ఒక్కో సంబంధం పెంచుకొని
ఏ విధి కాళ్ళకిందో
ఎపుడో అపుడు అవి కూలిపోతుంటే
పసిపాపాలా నా ఏడుపు సముద్రపు ఘోషలో
కలిపి

నిశబ్దపు  స్నేహం నించి చీకటిని చీల్చి
వెలుతురు  ధారలతో లోలోతుల మనసు నేలని తాకి
నాకు నేను ఒక సాహసం
నాకు నేను ఒక పోరాటం
నాకు నేను నిరంతర పునరావృత ఉషోదయమై
కనిపిస్తుంటా

వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు అమ్మ కొంగు ఓదార్పు
నాన్న భుజాలపై ఎక్కి
అటక పై పడ్డ బంతి దొరికే వరకు
వదలక  సాదించుకున్న మంకు ఏడుపు
అబద్దం ఆడినప్పుడల్లా భయపడి
చర్చి కిటికిలోంచి
గుస గుసగా సారీ దేవా అని చెప్పిన సమయాలు

కేకు కోసేవరకు అన్నం తినక
పుట్టిన రోజు పండుగకై 
నెల ముందు నుంచే ఎదురు చూపులు

అమ్మ అని రాయడం మొదలు
చదువయిపోయేంత వరకు
నమ్మడం నేర్పిన స్నేహాలు
నమ్మి మోసపోవడం నేర్పిన నేస్తాలు

ఒక్కొక్కటిగా ఏవేవో విత్తనాలు
ఎక్కడెక్కడి నదులో
పచ్చదనం చూసొచ్చే పక్షుల్ని
నేను అనే అరణ్యం లోకి
అనుమతిస్తూ
గాయపడి పాఠం నేర్చుకుంటూ
భంగపడి ప్రతిఘటించి ధైర్యాన్ని
చెంతనే ఆయుధంగా పెట్టుకుంటూ

ఇప్పటి వరకు ఇలా వ్యాపించా
నా స్థలం ఎంత మేరని
నిర్దేశించాడో దైవం
అంత వరకు నేనే నాకు
నా భావాలతో నా ఊహలతో
రమిస్తూ
పచ్చదనం తగ్గనివ్వక
నన్ను నేను
నాకోసం నా లో నాకైన వాళ్ళ కోసం
అడుగులలో అడుగు వెసుకుంటూ
పుప్పొడి వాసన రాసుకొని
సీతకోక చిలుకల గుంపులతో
పరవళ్ళు తొక్కే నదుల పలకరింపుల ముచ్చట్లతో
సాగిపొతున్నా
నాకు నేనే
పుట్టిన రోజు శుభాకంక్షలని చెప్పుకుంటూ




Sunday, August 19, 2012

చాకలి రేవు
----------------
ఆ వీధిలో నేను...
ఎలా వచ్చాను ఇక్కడికి?
దగ దగ మెరిసే కాంతులు
ప్రకాసవంతంగా మెరుస్తున్న
ప్రజలు...

వెనుక నుండి ఓ చేయి
తడుతూ అడిగింది
"సిగ్గేస్తుందా...."?
కళ్ళ నిండా నీటి ఊట...

పెదవ్వుల్లో పొడిచి ఉన్న
మరణ సూదిని తీసేసి
"అవును" అన్నాను...!!

అడుగు వెనక్కి వేయబోతూ...
వంచన కత్తిని ఎదరించి
నన్ను నేను అనచుకుంటూ
నిలబడి అడిగాను
"ఇక్కడే వుంటాను"
అని ...

అటు చూడూ...!!
"ఆ చాకలి రేవును
నా రక్తం నీ కోసం
ప్రవహింపచేస్తున్నా"
అన్నాడు తాను...
ప్రభువా! అనేంతలో
తను కనుమరుగు కాగా

వాలిపోయాను
పరిషుధుల గుంపులో
వస్త్రం
వుదుకుకోని నిలబడ్డాను...
దారి అంచులో నిలబడి
ఈ వింత చూస్తున్నమరొకని
రా అన్నాను!!

ఉదుకు కొనలేను అంటూ
వెళ్ళిపోయాడు
అది చూసి విలపింస్తూ
కేక పెట్టాను
వినబడిందా నీకు...!!
by SURESH JAJJARA
ఏవరి పాదమో గుర్తొచింది (By-Mercy Margaret )
----------------------------------------

రెండు పాదాలు కావాలిగా
నడవడానికి

మరి నాకేంటి ఒకటే పాదం
ఉంది
కాని ఇంత దూరం వచ్చా

వెనక్కి తిరిగి చూసా
ఒకే పాద ముద్రల్లా లేవు
నాది కాని
నాతో నడిచిన
ఇంకెవరిదో
ఈ పాదముద్ర

ఆ పాదానికి ఎదో
గాయం
మేకు దిగినట్లుంది
దారి పొడువునా
రక్తపు మరకలే
నా పాదం వెంట
స్పష్టంగా కనిపిస్తుంది

నా పాదం అప్పుడప్పుడు
నడవక మొరాయించినా
నేను దాన్ని
పట్టించుకోలేదు
రక్తం కారుతున్నా
ఆ మరో పాదం
తనతో పాటు ఆగి
పరామర్శలు చేసిందట
నా పాదనికి
తన భాదని వదిలి

రాళ్లు రప్పలు
కొండలు గుట్టలు
ముళ్ళ కంపలు
గచ్చపొదలు
దాటుతున్నప్పుడు
నా పాదాన్ని
కింద పెట్టనివ్వకుండా
బాధనంతా తనె తీస్కుందట

ఇప్పుడే
పచ్చిక లోకి వచ్చాక
కాని తెలియలేదు
ఆ పాదం నాకోసం ఎందుకింత
కష్టపడుతుందో

ఏవరి పాదమో
తెల్సుకోవాలని చేతిలోకి
తీసుకొని చూస్తే
ఎక్కడొ చూసిన జ్ఞాపకం

ఎక్కడా ?
ఎక్కడా?
హా... గుర్తొచింది
అదే అదే
ఆ కలువరి గిరిపైనా
ఆ సిలువ పైన

పరుగెత్తి పరుగెత్తి
పాపం చేస్తూ
పాప రోగం సోకి
నా కాలు పోగొట్టుకున్నపుడు
ఏడ్చిన ఏడ్పుల్లొ
దేవా యెసయ్యా
అని అరిచిన క్షణాలు జ్ఞాపకం

ఆ స్వరం ఆయనని చేరి
ఆయన పాదం
నా ఒంటి పాదానికి
తోడుగా వచ్చింది
నా కన్నీళ్ళు
ఇప్పుడు ఆ పాదంపై
ముద్దాడుతూ
ఆ స్రవిస్తున్న రక్తం
నా పాప రొగానికి
వైద్యం చేస్తూ ..
(by-Mercy Margaret --17/8/2012 ) —