Saturday, June 30, 2012

ఇంకిదే నా చివరి ప్రయత్నం దీని తరువాతే 
నా చావు గురించి ఆలోచన 
ఆయనని ముట్టుకోవాలి .. ఎలా అయిన సరే 
అంత జనసంద్రంలోంచి  ఆయనను చేరుకోవాలి 
ఎలా ఆయనని చేరేది ?
నా చివరి ఆశ కోరిక ఇక ఆయనే కదా 


పండ్రెండు సంవత్సరాలుగా 
కడుపులో పెళ్ళుబుకుతున్న 
రక్తపు అగ్ని పర్వతాలే 
కడుపు కోత  ,పేగుల మెలివేత
క్షీణిస్తున్న బలం ,
అడుగువేయలేని అసహాయత 
పాదాలపై పట్టులేని వణుకు ఎక్కిరింత 


నలుగురికి దూరంగా నన్ను నేనే వెలివేసుకునే 
నిస్సహాయత 
నన్ను నేనే అసహ్యించుకుని ,
కాలాన్ని నిందింస్తూ.. 
లోకపు వెలిచూపుల ముళ్ళ మధ్య 
నలిగిపోతున్న నా తనువు 
జీవచ్చవపు చేప ఎదురీత 


మొలకెత్తిన చిన్న విశ్వాసపు ఆశ ఆయన రాక వినగానే 
నవనాడులన్ని శక్తినింపుకుని 
విశ్వాసం  చిగురు తొడిగి పచ్చగా 
నాలొ  ఉత్సాహం నింపి ముందుకు తోసింది 


వేవేల జనాల మధ్యనుంచి అందరిని తోస్తూ 
ముందుకు అడుగేసా 
ఆయన వెనకే నేను ,ఆ మూర్తిభవించిన 
అద్భుత ప్రేమమూర్తి వెనకే నేను 
శక్తినంత  కూడగట్టుకుని , వణుకుతున్న చేతులతో
తన ప్రశస్త  వస్త్రం మెల్లిగా ముట్టుకున్నా 
అంతే ...


నరనరాల్లో జీవం పెల్లుబికింది 
కడుపులోని రక్తపు లావా ప్రవహించడం ఆగిపోయింది 
కొత్త శక్తి నా తనువును నింపి
 యవ్వనపు ఉత్సాహం తిరిగొచ్చింది 
డబ్బు ఖర్చు చేసి స్వస్థపడగలనని  భ్రమపడి  
వ్యయపర్చుకున్న రోజుల మూర్కత్వం పటాపంచాలయింది 
ఆయన వస్త్రాలలోని ప్రభావమే నా రక్తస్రావ రోగాన్ని 
బాగుచేసి ,ఆయన దైవత్వాన్ని నాకు బయల్పరిచింది 


ఆ క్షణమే సమర్పించుకున్న నా జీవితం ఆయనకీ 
ఉండలేనని అర్ధమయింది ఆయన స్వరం వినలేని రోజు నేనని 
నా సర్వస్వం ఇక యేసయ్యే అని 
నా జీవితాంతం ఆయనకు సజీవ సాక్షినని  
BY -Mercy Margaret   




Friday, June 29, 2012



నాతో వస్తావా ?
హృదయంలో పొంగే దుఃఖాన్ని
నలుగగొట్టే భారమైన భాదల్ని
భుజాలపై మోసుకెల్తున్న నీవు
అంధకార మూటల బరువుల్ని
తీసివేసి
రూపు దాల్చిన వాక్యమైన వాని
దగ్గరికి

నాతో వస్తావా ??
మోసం చేసి పారిపోయి
ప్రేమా, సమాధానం వెలగా కట్టి
భద్రత కొందామని
అయోమయపు కట్లలో చిక్కుకున్న నీవు
హృదయాన్ని విడిపించుకోలేక
స్వనీతి బరువులను మోయలేక
కృంగిపోతున్న వేళ
నీతి కిరణాలు నీపై ప్రసరింపజేసి
ఆ కట్ల నుంచి విడిపించు వాని దగ్గరకి

నాతో వస్తావా ??
ఆశలకోరకై పరుగెత్తి దురాశను
గర్భాన మోస్తూ
పాపపు బరువును దించుకోలేక
దారులు వెతుకుతున్న నీవు
నీ కట్లు తెంపి నీకు విడుదల నిచ్చే
గొర్రెపిల్ల హస్తాల దగ్గరకు

నాతో వస్తావా ?
నా బరువులు తీసివేసి
నాతో సహవాసం చేస్తూ
పచ్చిక బయళ్ళలో నా ప్రాణాన్ని
నడిపించే
రక్షకుడు యేసు క్రీస్తునొద్దకు ...
--{@ By-Mercy Margaret (28/6/2012)@}--
 — 
వెర్రి వాడినా ?
అవును .. 
చీకటిలోనుంచి వెలుగులోకి 
మరణంలోనుంచి జీవంలోకి 
అబద్దం నుంచి నిజానికి 
క్షయం నుంచి అక్షయానికి
దాటాలని అనుకుంటున్నా కదా....

నా కళ్ళేప్పుడూ ఆకాశం వైపే చూసాయి
ఏదో ఈ భూమికన్నా ఉన్నతమైనది ఉందని
ఆలోచనల్ని జ్ఞానాన్ని ఉపయోగించి నన్ను నేను
కాపాడు కోలేనప్పుడు
ఎంత ప్రయత్నించినా ఇంకేందో అసంతృప్తితో నన్ను నేను
ఈ లోకాన్ని చూసినప్పుడు

శాశ్వతమని నమ్మి ,సంబరాల్ని చేసుకునే
మనుషుల్ని చూసినప్పుడు
మంచి దారులన్నీ చెరిపేసి ,నీతి నిజాయితిలకి
నీళ్ళు వదిలినోళ్లను చూస్తూ
వావి వరసలని మర్చి , తమలోని రాక్షసులని
మేల్కొల్పుతున్నప్పుడు
పేగు బంధాలని ఛీ కొట్టి విచ్చలవిడి తనమే లోకమనుకునే
వాళ్ళని చూసి
ఎక్కడున్నానని నన్ను నేను ప్రశ్నించుకుంటూ

నా చుట్టూ ఒక వెలుగు వలయం కావాలని ప్రార్దిస్తునప్పుడు

దాటిపోవాలని ఈ మాయలోకం నుంచి
మచ్చ అంటకుండా బ్రతికి పవిత్రత కాపాడుకోవాలని
ప్రయతినిస్తూ ..
కుటుంబాన్ని కాపుదలతో
దైవ ప్రేమలో నడుపుతున్నప్పుడు .

దర్శించిన ఆ దైవ స్వరం నన్ను
రక్షణ ఓడ చేసుకోమని
పిలుపునిచ్చి ,కొలతలిచ్చి ,పర్యవేక్షిస్తూ
సమయమిచ్చినప్పుడు
జరిగిన విషయాల్ని చెప్పి మారమని ప్రాదేయపడ్డా
వినకుండా నన్ను ఎగతాళి చేస్తూ

నిజమే నీతిమంతుడని దేవుడన్నా..!! వాడా? అంటుంది లోకం
ప్రాణాల్ని రక్షించుకో, ప్రవచనం వచ్చిందన్నా
సైన్సు పరిజ్ఞానంతో సవాలు నిరుపించుకోమంటుంది
అమాయక జనం

నిజమే కదా ...
ఆ మేల్కొలుపు మాటలు -జీవితాన్ని కాపాడుకోమని చెప్పే మాటలే
నాకు రక్షణ
నా ఆత్మను కాపాడుకొనే ప్రయత్నమే
నా వెర్రితనం
అరిచి అరిచి ,, చెప్పి చెప్పి అలసి పోతున్న
నోవాహు స్వరం
--{@ BY-Mercy Margaret (26/6/2012...8.20 am )@}-
ఒక్క మాటతో- 
నిరాకర శూన్యం నుంచి సృష్టిని ,
-అగాధ జలములపై చీకటిని 
వెలుగును పిలిచి ఓడించి ..
చీకటి వెలుగుల చేసి ,

ఒక్క మాటతో-
జలముల మధ్య ఒక విశాలము కలిగి
ఎల్లల్ల లెక్కలు నీవేరిగి
ఆకాశమును చెసి,

ఒక్క మాటతో-
క్రింది విశాలమును నుండి నేల కనబడగా
పిలిచి,
భూమి ,సముద్రములు ,
తమ తమ జాతి చెట్లు , విత్తనములు
మొలిపించి,

ఒక్క మాటతో
పగలును రాత్రిని చీల్చి
సూర్య చంద్రులను , నక్షత్రాలను చేసి

ఒక్క మాటతో -
ఆకాశం నుండి పక్షుల,
జలములనుండి
జలచరాలను యిట్టె కలుగచేసి,

ఒక్క మాటతో -
భూమి జాతి చొప్పున ప్రాణులు ,పురుగులు
జంతువుల పుట్టింపగా జేసి ...

ఒక్క మాటతో కాదు నీ చేతలతో నే
నాపై ప్రేమ చూపాలనా దేవా..!!

మట్టి ముద్దను నీ చేతుల్లో తీసుకొని
కుమ్మరిలా కూర్చుని
నెమ్మదిగా నీ రూపం కలుగునట్టు
యుగాల రహస్యాలను నా నిర్మాణంలో చూపిన
ఎంత గొప్ప శిల్పివి నీవు ..
ఎంతటి నిర్మాణకుడవు నువ్వు దేవా

శిరసానమామి స్వామి ...
హృదయ దేవాలయాన నెలకొని
పాలించు మా ప్రభు "ఉన్నావాడ అనువాడ"
సర్వాంతర్యామి ..సదాప్రణామి

--{@ ♥ BY-MERCY MARGARET ♥@}--(23/6/2012...6.00 pm)

"నా కృప నీకు చాలును
_________________
ఒక ముళ్ళు అలాగే ఉండిపోయే
లోలోపల గాయాన్ని
రేపుతూ .
ఆ గాయం నొచ్చుకున్నప్పుడల్లా
నీ వైపు నా కనులు త్రిప్పి
చీకటి తిమిరాలు బాపుతూ

చేదునంత తీసుకున్న నిన్ను
మది తలంచుకుంటూ
చిరక పుచ్చుకున్న క్షణాలను నీకిచ్చిన నేను
ద్రాక్షరస ధారలే నాకిచ్చిన నిన్ను
తనివి తీర గుర్తు చేసుకుంటూ

పాపులలో ప్రధముడనై
ప్రేమ జాతినే హింసించాలని
నీ నామాన్ని మంటుపెట్ట ప్రయత్నించినా
దమస్కు మార్గంలో నీ దర్శనం
నా గుండెల్లో రగిలించుకుంటూ

ముద్ధాడుతున్నా ప్రభు ..ఆ రక్త సిక్త పాదాలు
మొరలిడుతున్నా ప్రభు .. ముళ్ళు తీయమని బ్రతిమాలుతూ

ఆ చలువ కనుల చూపుల్లో
ఆ చేతి గాయపు స్పర్శగాఢతతో
నీ గుస గుస వినిపిస్తునావు ..
"నా కృప నీకు చాలును అంటూ " ..


--{@ ♥ BY -Mercy Margaret (22/6/2012 ....9.00 pm ) ♥@}--
_________________

విడుదల
**********
నేను బయటపడ్డా ..
నేను పడ్డ ఆ గుంటలో నుండి
బయటపడలేని జిగటగల ఊబి
అపవాది అనే దొంగ త్రవ్విన
గుంట నుండి
పడి కూరుకు పోవడమే కానీ
బయటపడలేని ఊబి నుండి ..

మునిగిపోతూ కేకలు వేసా
కూరుకు పోతూ సహాయం కోసం
అర్ధించా ..
ఎవరెవరో వచ్చారు సహాయానికి
శక్తిలేక .. పట్టులేక .. జ్ఞానం లేక
నన్ను లాగుతూ వాళ్ళు పడిపోయి..
కొందరు
చూస్తూ హేళన చేస్తూ
వెళ్ళిపోయిన ఇంకొందరిని చూసి ..
రోదిస్తున్నా ..

లోలోపలికే లాగుతున్న ఊబి
నా ఊపిరినే నులిమి
నా జీవాన్నీ జీవితాన్ని
లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్న
దానితో పోరాడుతూ .. ఓడిపోతూ
సహాయం కోసం ఎదురుచూస్తూ
మూలుగులతో విడుదల కోసం
నిట్టూరుస్తూ మొరపెడుతూ
కోల్పోతున్నా నన్ను నేనే
అనే సమయంలో ....

ఎటు నుంచో స్వరం
నా చేయి పట్టుక్కో మని
ఆ చేతినుంచి కారుతున్న రక్తం
నా నుదుటిపై పడి
నా కళ్ళకి తేట నిచ్చి
నా ఎండిపోయిన ఆశలను .. జీవితాన్ని
తిరిగి జీవంతో నింపి
నా చేతిని పట్టుకొని బయటికి లాగి
ప్రేమగా నన్ను హత్తుకుంది

తలపై ముళ్ళ కిరీటం
పక్కలో బల్లెందించడం వల్ల
అయిన గాయం
నన్ను ఆ గుంటలో నుంచి లాగడానికి
తను చెల్లించిన పరిహారం ..
ఎందుకు ఇంత త్యాగం నాకోసం అని
అడిగిన ప్రశ్నకు ...
నిన్ను ప్రాణం పెట్టేంత ప్రేమిస్తున్నానని
తను చెప్పిన సమాధానం

ఏమివ్వగలను ఇంతటి విడుదలకు
నీ ప్రేమకని అడిగా
నా కుళ్ళిపోయిన హృదయం
గుంటలో పడి మురికి
అంటుకున్న నేనే కావాలన్నది
ఆ స్వరం
నా గుండె ఏడుస్తుంది
మేకులు దించిన ఆ పాదాలను
ముద్దాడుతుంది
కన్నీటితో తన పాదాలు కడిగి
నా ప్రేమ అత్తరును తనకి పూస్తూ ..
జీవితాంతం తన పాదాల దగ్గర
చోటుచాలని సంతోషిస్తుంది ..
written by -
Mercy Margaret (5/6/2012)


నీవు జాలరివి
నే చేపనులే
నీ వలలో నే చిక్కుకొందును .." యేసు "

ఎన్నెన్నో వలలున్నాయి యేసు
ఏవేవో గాలాలు ఎదురుచూస్తున్నాయి
నీ వలలో చిక్కుకొందును యేసు
నీ రాశిలో నన్ను చేర్చుము

దారి తప్పించు స్నేహాలున్నాయి
ఉరి యొద్దకు చేర్చు- కోరికల యెరలున్నాయి
పాపాల పడిగాపుల లోతులెన్నో ఉన్నాయి
ప్రేమగా నటించు పగవారి సుడులున్నాయి

తిని వేయాలని ఎదురుచూచు -కన్నులు ..
చీల్చి వేయాలని ఎదురుచూచు- చేతులు ..
పడినా నీ వలలో నాకు రక్షణే
పరమ జాలరి నీ యొద్ద నే సురక్షితమే

నీ వలలో చిక్కినా పరలోకం ఉందిలే
జీవ నదిలో నను చేర్చు భాగ్యముంది నాకు
హల్లెలుయా గానాల కేరింతల సందడితో
నిత్యానందపు సంద్రంలో నిత్య జీవ ముంది నాకు ...





BY-MERCY
 

నా హృదయం నీ మందిరమేగా
యేసు నీ కోసం దానిని సిద్ధపరచనా ?
ఒక్కసారి అడుగు పెట్టావా ప్రభు
నా హృదయాలయం పావనమవగా ..

భ్రష్టు పట్టిందయ్య హృదయం రోత ఆలోచనలతో
మష్టుతో నిండిందయా - మంచి ఏ మాత్రం లేక
తిష్ట వేసుకొని కూర్చుందయ్యా పాపం
నిష్ఠ ఏమాత్రం లేని ఆత్మీయ రోగపు స్థితిలో
అందుకే
ఒక్కసారి అడుగు పెట్టయ్యా యేసయ్యా
నా హృదయాలయం పావనమవగా ..

తట్టి తట్టి వెళ్ళిపోయావా ? యేసయ్యా
తప్పునాదేనయ్యా
తప్పుల భ్రమలో తూలుతూ - తండ్రీ
నీ పిలుపు వినలేదయ్యా
త్రోవ తప్పి తిరుగుతూ అలసిపోయానయ్యా
తప్పి పోయిన కుమారుడనై మళ్ళీ నీ చెంత
చేరానయ్యా
అందుకే
ఒక్కసారి అడుగు పెట్టయ్యా యేసయ్యా
నా హృదయాలయం పావనమవగా ..

హృదయపు తాళపు చెవి ఇదిగో యేసయ్యా
జీవపు వెలుగై ప్రవేశించయ్యా ..
పాపరోగం పోయేనయ్యా
ప్రశాంతత హృది నిండేనయ్యా
జీవం నీవేనయ్యా యేసయ్యా
నీ రక్తంతో నన్ను కొన్నావయ్యా
దావీదు కుమారుడా కరుణించయ్యా అంటే
హృదయం అంతా నిండేవయా
అందుకే
ఒక్కసారి అడుగు పెట్టయ్యా యేసయ్యా
నా హృదయాలయం పావనమవగా ..

BY-MERCY
 


నా యేసు నీ చెంత నేనుండా నా ధన్యతే
ఏ యోగ్యత లేని నాకు నువ్విచిన భాగ్యమే 



పరుగెత్తి అలిసిపోయా
నా పాపాలు నన్ను తరుమగా
నీ సిలువ చెంత ఆగిపోయా
నీ కృప నన్ను పిలవగా 



నా మలిన వస్త్రములతో ..
జీవితమే నటనతో
ఆత్మీయ జీవితం సుష్కించిపోగా



ఆ సిలువపై నుంచి నా కన్నులలోకి
నువ్వు చూసిన ఆ సూటిఅయిన చూపు
నా హృదయాన్ని గుచ్చి
నొప్పి లేని ప్రేమతో నీ గాయాల అర్ధం చెప్పి
నా స్థానంలో నీవు సిలువపై
నాకై మరణించినావుగా 



నాకు రక్త సంబంధికన్న ఎక్కువైనావుగా
నాలో వుంటూ పరలోకాన్నే
నా హృదయంలోకి తీసుక్కోచ్చావుగా
ఇక నా జీవితమే నీవైనావుగా
BY-mercy
 
నా దోనెలో నీ కాలు మోపి 
నా హృదయాన్ని నీదిగా చేసుకొని 
నా దూకుడు తనాన్ని మెతకతనంగా చేసి 
రాయిగా నీకోసం మార్చి వేసి 
మనుష్యులను పట్టు జాలరిగా మార్చిన 
నా యేసు నీ కొరకు నే సజీవ సాక్షిని ...

సముద్రమంత అడుగడుగు గాలించిన కనులకు
కానరాని చేపలను రాశిగా కూర్చి చూపి
నీ మహిమను చూపి నా మూర్ఖత్వం బాపి
నీ కొరకు మనుష్యులను పట్టు జాలరినగుటకు
నాకు శిక్షణనిచ్చి నన్ను ప్రేమించిన
నా యేసు నీ కొరకు నే సజీవ సాక్షిని ...

నిన్నువదలను నీతోనే .. నీవెంటే నీ జంట అని
ప్రేమగా నీతోనే ఉండాలని ఉరుకులాడి
నీకై వచ్చిన సైనికుని చెవినే తెగనరికితీ
నీతో ఉండాలనే తపన తోనే అయినా
ముమ్మారు నినునే నెరుగనంటినని చెప్పినా
నా కాపట్యం బద్దలు చేసి నీ ప్రేమతో నను మన్నించి
నీ సిలువ యాత్ర చూడ నాకు భాగ్యమిచ్చి
నా హృదయంలో నీ ప్రేమతో చెరగని ముద్రవేసినా
నా యేసు నీ కొరకు నే సజీవ సాక్షిని ...

నేను పేతురుని ..
ప్రభువా నీ కొరకు రాయిగా మారుటకు ..
నీ సంఘం నా మీద కట్టుటకు ఇష్టపడిన వాడిని
నా యేసు నీ కొరకు నే సజీవ సాక్షిని ...
BY- mercy ...
యేసు 
నిన్ను చూచిన కనులకు 
ఎంత భాగ్యం ...
నీ సమయంలో నైనా పుట్టకపోతిని ..!!


యేసు 
నీ మాటలు విన్న చెవులకు
ఎంత భాగ్యం...
నే లాజరు నైనా కాకపోతిని ..!!


క్రీస్తు
నిన్ను తాకిన చేతులకెంత భాగ్యం..
మగ్దలేనే మరియనైన కాకపోతిని ..!!


యేసు
నీ శ్వాస తాకిన శరీరాలకెంత భాగ్యం
నే నీ శిష్యులలో ఒకడినైన కాకపోతిని ..!!


క్రీస్తు
నీ చేతులు తాకిన జీవితాలకెంత భాగ్యం
శవమై తిరిగి లేచిన యాయిరు కుమార్తేనైన
కాకపోతిని ..!!


యేసు ... నన్ను తాకుము
నా క్రీస్తు నీ మాటలతో హృదయ శుద్ధి నిమ్ము ..
నిన్ను చూడగా నా కనులు వెతుకుచుండగా
నీకై పరుగెత్తగా నా పాదములే
నీవిగా చేసి
నీకై నేను యేసు
నాకై నీవుగా ...
BY -mercy ..♥

అంధకార లోయలో నేను నడిచిన వేళ
నా కాలు జారి నేను పడబోవు వేళ 
నీ వాక్యం నా పాదములకు దీపమై నన్ను కాపాడిన వేళ 
ఏమివ్వను ఏమివ్వను ఏమివ్వనయ్యా   !! 

దేవ నా స్తుతి కీర్తన అందుకోవయా .....
వేదన శోదనలు అలలై ఎగసే 
ఈ లోకసంద్రనా నేను ఈదు వేళ 
మునిగే సమయాన నీ వాక్యపు వలవేసి నన్ను పైకి లాగి 
నీ ఓడలోకి నన్ను చేర్చుకున్న వేళ
ఏమివ్వను ఏమివ్వను ఏమివ్వనయ్యా  !!


దేవ నా స్తుతి యాగం అందుకోవయా ..... 
ఏ తోడు లేక ఒంటరినై తిరుగాడగ 
లోకరణ్యంలో దారి తెన్ను గానక 
హాహాకారాలతో అపవాది నన్ను వెంటాడగా 
నీ వాక్యపు కంచవేసి సర్వాంగ కవచము నీవైన వేళ
ఏమివ్వను ఏమివ్వను ఏమివ్వనయ్యా  !!  
దేవ నా స్తోత్రర్పణ అందుకోవయా ....          
...(by ..mercy)