Saturday, July 28, 2012

నాకు ఒక శవం ఎదురైంది 
మాట్లాడుతుంది
నడుస్తుంది
శ్వాసిస్తుంది 
నవ్వుతుంది 
ఏడుస్తుంది
కాని అదంతా జీవం లేక
ఎండిపోయిన చెట్టు చేస్తున్న
ఆర్భాటం లాగే అనిపించింది

అడిగా దాన్ని
నువ్వు శవం ఎలా అయ్యావ్ అని ?
తలదించుకొని
నా పేరు సార్ధీస్ సంఘం అంది

నీ కధేంటి ?
అని అడిగా

-"నేను తెల్లని వస్త్రాలు ధరించుకోలేదు
నా పనులు ప్రభువు యెదుట సరిగా కనబడలేదు
విన్న ఉపదేశాన్ని మనస్కరించి అనుసరించేలేదు
ఆయన కోసం జాగరూకతతో ఎదురుచూడలేదని
యోహానుతో వ్రాయించాడు

ఇదో
అప్పటి నుంచి ఇలా
బ్రతికే ఉన్నా చచ్చిన దానిలా
చావనైయున్న మిగిలిన వారిని ప్రభువైపుకు
నడపాలని
దొంగలాగ వచ్చి నన్ను నిలదీసినట్టే
మీ అందరిని నిలదీసే రోజు ఒకటుందని
ఉదాహరణగా తిరుగుతున్నా

జయించిన వానికి జీవకిరీటం
ఇచ్చి
జీవగ్రంధంలో పేరు తుడవక
దూతల యెదుట ఒప్పుకొని
హత్తుకుంటానికి
ఆయన దినమెల్ల చేతులు చాచి
ఎదురు చూస్తున్నాడని
అందరికి చెపుతూ తిరుగుతున్నా

నాకు మళ్ళీ చిగురించే రోజు ఉందని
ఆయన నీటి ఓరన నన్ను నాటి
ఫలించే కొమ్మగా
ఆయన సన్నిధిలొ దివారత్రులుండి
నన్ను నేను సజీవ సాక్షిగా ..
మార్చుకుంటానని కన్నీళ్లు
విడుస్తుంది --"

ఆ శవం రూపంతరం చెందాలని కోరుతూ
నువ్వెలా ఉన్నవాని
ఒక ప్రశ్న నా ముందు సవాలుగా
ఉంచుతూ...నా స్థితి నాకు
చూపిస్తుంది
(జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కాని నీవు మృతుడవే ప్రకటన 3:1-7)
♥(By-Mercy Margaret (28/7/2012)♥

Wednesday, July 25, 2012

పేతురు -చలి
---------------
ఒంటిని వణికిస్తున్న
చలి 
పులిలా ఎముకలని కొరికేస్తున్న
చలి 
కాని తనకు మాత్రం 
అల్లకల్లోలమైన గుండె మధనంలోనుంచి
రక్షకుడని
తనకు తెలిసిన వాడేమవుతాడో అని
వేడిపుట్టిస్తున్న భయం

అప్పటికే ఇద్దరడిగారు
నువ్వు యేసుతో కూడా ఉండువారిలో
ఒకడివి కదా అని
ఏమని తప్పించుకున్నాడు
అబద్దాన్ని కప్పుకున్నాడు
వెచ్చని దుప్పటి కన్నా
అదే బాగున్నట్టుంది

ఆ చిన్నదెవరో
తననే చూస్తుంది దగ్గరగా వచ్చి
యేసువాడివేగా అంది
మళ్ళీ అబద్ధం
వేళ్ళకు వేడిగా చలికాచుకునే
మంట అంటుకున్నా స్పర్శెక్కడిది
మూడొసారి బొంకుకే
ఒప్పుకుంటూ కొడి కూసింది

ఆయన
మాటలు గుర్తొచ్చాయి
-"నన్నెరగవని ముమ్మారు చెపుదువని"
ఎక్కడి చలి
నమ్మకాన్ని వమ్ము చేసిన శిష్యరికానికి
చచ్చిపొయేంత బాధ
అబద్దపు దుప్పటి
అవిశ్వాసాన్ని తరిమేయని అగ్గి
ఎంత కాలం కాపాడుతుంది?

కళ్ళలో కన్నీరు
పశ్చాత్తాపం గుండెని కడిగేస్తుంటే
ఆ క్షణం
నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువని
ఒప్పుకున్న పెదాలు
ఇప్పుడు పలికిన అబద్దాన్ని బట్టి పల్ల కింద
నలిగిపొతుంటే
విరిగి పోయిన హృదయాన్ని
ఇప్పుడు ప్రభుకివ్వాలని
ఆయనని హత్తుకొని గట్టిగా ఏడ్వాలని
బయలు దేరిన
పేతురు

నీలొ నాలొ మనతో ఎందరో
తెలిసి ఒప్పుకోని స్థితి
ఆయన ప్రక్కనుండగానే
గుర్తించలేని దుస్థితి

(BY- Mercy Margaret (25/7/2012 )

Wednesday, July 18, 2012


పచ్చ పచ్చగా  
ఆ గడ్డి పిలుస్తోంది నన్ను 
ఇంత మంచి స్థలం వదిలి 
ఈయనేంటి అటేటో వెల్తాడు ?


దాక్కుని దాక్కునే వెళ్తున్నా హమ్మయా 
నా" స్నే"హితులందరూ 
నా కన్నాముందుకెల్లాయి
యాహూ ...
ఇంకే ఇష్టమున్నంత సేపు ఆడుకొని వెళ్తా 
ఏయ్  కొండ కోన 
వాగు వంక 
చెట్టు చేమ 
నాతో పాటు కలిసి పాడేయండి 
చిన్న గొర్రె పిల్లనేను ఏసయ్యా అని 


ఏంటి 
గుండెలు దద్దరిల్లేలా గర్జిస్తున్న శబ్దం 
సింహమే .. 
అవును సింహమే 


చక్కగా ఆయన ప్రక్కనే నడుస్తూ 
దుడ్డు కర్రతో అందించిన ఆకులు అలములు 
తింటూ ..
పచ్చిక జలాలదగ్గర తీస్కెళ్ళి సేద తీరుస్తుంటే 
ఊరుకోక 
నాకు నేనే తెచ్చుకున్న ఉరి .. 
పరుగెత్తి పరుగెత్తి వచ్చి పడ్డ ఇదే 
అపవాది నాకై త్రవ్విన ఊబి 


ఆ శబ్దం నా దగ్గరకొస్తుంది .. అదో వచ్చేస్తుంది
నా పాట గాలిలో కలిసినట్టు 
నేనూ కలవాబోతున్నాని  తెలుసు
ఒక్కసారి నా కాపరి స్వరం విన వస్తేబాగు 
అరిస్తే -"నేను " దొరికిపోనా ఆ సింహానికి
 దేవా ఎలాగు ?


మూసుకున్న కళ్ళలో ఆగని కన్నీరు 
వీడి వచ్చిన జీవాన్ని గుర్తు చేసుకునే తీరు 
తిట్టుకుంటే ఏంటి ఇప్పుడు బుద్ది లేదు లేదు 
ఇంకెక్కడి ఆశ పోతుంది ప్రాణం ఎలాగు
క్షమించు నా కాపరి దారి తప్పిన పిల్లను 


దగ్గరవ్తున్న సింహపు శబ్దం..

నా మెడ నొక్కు తున్నదెవరు ఊపిరాడడం లేదు
కాపరి దుడ్డు కర్ర మెడచుట్టు చేసిన గాయం  చూడు 
అయినా పర్లేదు నేను బ్రతికి పోయా 
తను కొట్టినా నన్ను... నాకు  బ్రతుకు నేర్పటానికే నేడు 


ఎంత ప్రేమ చూడు ఆయనకి 
నాకోసం గాయాలు తగిలించుకొని రక్తాలు కారినా 
నా గాయాలు కట్టి నన్ను ఎత్తుకున్నాడు 
ఆ కళ్ళలో నుంచి నాకోసం 
ఆరాటంతో కారుతున్న కన్నీరు 
అలా నా మొహాన్ని తడుపుతుంటే 
ఇంకెప్పుడూ ఆ ప్రేమని నా కాపరిని 
చచ్చిపోతున్నా వదలనని 
కారుతున్న నా కన్నీరు 
గాయపడి స్రవిస్తున్న 
తన పాదాలపై ప్రమాణ పూర్వకంగా ...
--{@ by- Mercy Margaret (18/7/2012)@}--

Saturday, July 14, 2012


నాలో ఒక అగ్ని పర్వతం
నాలో ఉవ్వెత్తున్న ఎగిరిపడుతున్న
కాంక్షల అలల ప్రవాహం
నాలో నన్ను ఏదో నెడుతూ
కాళ్ళు నిలువనీయని ఆలోచనల
స్వైర విహారం

ఆయనేవారో చూడాలి
ఈ ఎరికో ప్రజల మాటల నిజానిజాలు తేల్చాలి
ఓ మనిషిని ఇంతగా వెంబడిస్తూ
ఆయన చేసిన అధ్బుతాల సాక్షాలని నేరుగా
పసిగట్టాలి

ఎలా ఛ?
పొట్టితనం నాకడ్డు ఎలా అవ్తుంది
చూడాలనే తపనకి మార్గాలని వెతుకున్ని
శరీరం లోపమన్న ఆత్మలో తీవ్ర కాంక్ష బలం
నన్ను సాధ్యానికి సరి పడ ఎత్తుకి తీసుకెళ్తే
ఈ మేడి చెట్టు చాలదా ?
నా అవకాశంగా .. ఆయన్ని చూసే
తొలి అడుగుల ప్రయత్నంగా

అంత మంది చుట్టుముట్టి
నడుస్తున్నజనంలోంచి
దాక్కున్న ఈ చెట్టు కిందనుంచి ఆయన వెళ్తుంటే
చూస్తున్నా..
ఒక్క క్షణం నా గుండె వేగం పెరిగింది
కప్పుకు కూర్చున్న కొమ్మల నడుమ నుంచి
ఆ రూపం గుండెలో దిగి నా చీకటిని నరికేస్తూ
నన్ను వణికిస్తుంది

అదో అదో
ఆయనెందుకో ఆగాడు
ఏంటి ? తల పైకెత్తాడు
జక్కయ్య అని ఎవరో చెప్పినట్టు
నా పేరు పిలిచి దిగమన్నాడు

సర్వాంతర్యామి కదా !
ఒప్పేసుకుంది మనసు ఆయనకి
నేను  కడుపులో ఉన్నప్పుడే తెలుసని
అంగీకరించింది మనసు అతనే నా
రక్షకుడని
నా ఇంటికొస్తానన్న ప్రభుని
హృదయ తలుపు తీసి పిలిచా
నశించి పోతున్న గొర్రెనైన నన్ను రక్షించి
అబ్రహాము కుమారుడని పిలిచి
అవినీతి  కొమ్మల్ని నరికి
"నీతి"కొమ్మైన తనకు అంటూ కట్టుకొని
ఆత్మ ఫలం ఫలించగా
నాతో ..నాలో .. తానే అయ్యాడు
సుంకరిని శుద్దునిగా చేసి హత్తుకున్నాడు
నా రక్షకుడు
BY - mercy  margaret (14/7/2012)

Sunday, July 8, 2012

పరుగెడుతున్న జీవిత గడియారం 
ఎక్కడ దాని కాళ్ళు  ఆగిపోతాయో 
పరుగెత్తి పరుగెత్తి 
సమయాన్ని చూపిస్తూ దినమంతా చాచిన 
చేతులు 
అలసి ఆగిపోయే గడియ ఏదవుతుందో ?

నిమిషాలన్నీ ఒక్కొక్కటి వెనకకి 
విసిరేస్తూ 
నీకు తెలియకుండా లెక్కలతో ఆయువును 
మూటగడుతూ
 మర్చిపోతున్నవేమో??
వర్తమానమే నీది 
నిన్న రేపుల సంబంధివి  కావని 

జాలిపడుతుందదో  గడియారం 
శరీరపు సుష్కింపు చూసి కాదు 
ఆత్మ శరీరాన్ని ఒదిలి ప్రయాణించే 
గమనాన్ని తెలుసుకోమని 
కాలాలు సమయాలు ఆదినంలో ఉంచుకున్న 
తండ్రి  చేతులకు
నీ ఒపిరి ,ఆత్మల తాళపు చెవులు ఇవ్వమని 

రంగు రంగుల బుడగల క్షణాలు నీవి నావని 
అందమైన అడవిపువ్వులా ఉదయ సాయంత్రాల 
పరిది మాత్రమేనని 
వెనక్కి వెళ్ళని సమయం ముందుకు నెడితే 
సరి చేసుకొని హృదయాన్ని 
గురి వద్దకు పయనించే  పరుగు నేర్పమని 

ఇదే అనుకూల సమయం 
రక్షణ గడియలను స్వతంత్రిన్చుకునే క్షణం 
ఆలస్యం , ఇంకెందుకు 
ఆత్మ దీపాన్ని ప్రభు చేతిలో పెట్టగా 
చిందించిన సిలువ రక్తంతో పాప క్షమాపణ పొంది 
సిలువ దారిలో పరము చేర ఇష్టపడగా 

ఇదే అనుకూల సమయం 
రక్షణ గడియలను స్వతంత్రిన్చుకునే క్షణం