Monday, August 27, 2012

Mercy Margaret ll నిష్కళంకమైన ప్రేమll
---------------------------------------------
 1.
ఆమె 
బండసందులో ఎగురు పావురం 
పేట బీటల నాశ్రయించి 
ఎప్పుడూ  
తను వేసుకున్న కంచెలోనే 
కట్టుకున్న ఒంటరి కోటలోనే 
దాక్కునే పావురం 
2.
అతడు 
అడవి వృక్షములలో జల్దరు వృక్షం 
కొండలమీద నుంచి ఎగసిదాటుతూ
మెట్టల మీద నుంచి 
గంతులు వేస్తూ పరుగెత్తి వచ్చే 
లేడి పిల్ల 
3.
ఆ 
బండసందు దగ్గర నిల్చొని 
ఆమెను 
నా పావురమా 
నీ స్వరం మధురం ,
నీ ముఖము మనోహరం 
"నీ ప్రేమగా" మారాలని వచ్చానిఅని 
పిలుస్తూ తను 
4.
బెదురు  చూపులతో
భంగపడి ,మోసపోయి 
గుండె నిండా గాయాలతో 
ఏడ్చి ఏడ్చి గుంతలు పడ్డ కళ్ళతో 
బొంగురు పోయిన గొంతుతో 
ఆ బండ సందులో 
మూల్గుతూ ఆమె 
5.
ఆ మాటకు 
స్పందిస్తూ ఆశ్చర్యంగా 
అతని కళ్ళలోకి చూసింది 
6.
సప్త సముద్రాలకన్న  
అనంతమైన ప్రేమ నిండి 
తన కోసం ప్రాణం ఇవ్వగల భద్రత 
ఆ బాహువుల్లో కనుగొని 
7.
తన మురికి గతాన్నంతా 
మాటల హిస్సోపుతో ప్రేమగా పవిత్రం చేస్తూ 
లోకపు దృష్టి ,చెవులు కాకుండా 
దైవాత్మతో 

8.
అతడు 
ఆమె స్వరాన్ని పవిత్రమైన ఆలాపనగా 
భీతిల్లి గాయపడ్డ ఆమె హృదయాన్ని 
మనోహరమైన ముఖంగా 
ఆప్యాయంగా 
పిలుపుతోనే మాటల కౌగిలిస్తుంటే 
9.
ఏం చేయగలదు 
ఆ అద్వితీయ ప్రేమ కోసం 
కళంకమైన తన ప్రేమను 
నిష్కళంకమైనదిగా మార్చి 
అపవిత్ర మడుగులు ,మేడలనుండి 
పవిత్రమైన తన వక్షస్థలాన్ని ఆశ్రయంగా ఇస్తుంటే 
కృతజ్ఞత పూర్వకంగా 
కన్నీటి నీరాజనాలు 
రాలుస్తూ 
అతని పాదాల దగ్గర వ్రాలింది 
10.
ఇప్పుడు అతనే 
బండ సందు 
పేట బీటలు అని 
హృదయాన్ని తనకు అర్పిస్తూ 
ఆమె  
నిత్యమైన ప్రేమను అనుభవించబోతూ

Thursday, August 23, 2012


జనాభా లెక్కలో ఒక దాన్ని
---------------------------

నేను పుట్టినప్పుడు
తలితండ్రుల మొహాల్లొ
సంతోషం గురించి
వాళ్ళు చెప్పేప్పుడు వింటుంటే
నా కళ్ళలో ఏవో దీపాలు వెలిగిపొతాయి

సంవత్సరం సంవత్సరం
మారి పోతున్న
నా గురించి నేను ఆలోచిస్తుంటే
ఇసుక లొతుళ్ళోకి కాలు దిగబడి
మళ్ళీ పైకి తీసినట్టు
ప్రాణం ఎవో ఒత్తిళ్ళకి లోనై
వెంటనే
కొద్ది సేపు శ్వాస తీసుకున్నట్టు
అనిపిస్తుంది

జీవితాన్ని సముద్రం చేసుకొని
తీరంలో పసిపాపలా
ఒళ్ళో ఇసుక నింపుకుని పిచ్చుక గూళ్ళు కడుతూ
ఒక్కో గూడుతో ఒక్కో సంబంధం పెంచుకొని
ఏ విధి కాళ్ళకిందో
ఎపుడో అపుడు అవి కూలిపోతుంటే
పసిపాపాలా నా ఏడుపు సముద్రపు ఘోషలో
కలిపి

నిశబ్దపు  స్నేహం నించి చీకటిని చీల్చి
వెలుతురు  ధారలతో లోలోతుల మనసు నేలని తాకి
నాకు నేను ఒక సాహసం
నాకు నేను ఒక పోరాటం
నాకు నేను నిరంతర పునరావృత ఉషోదయమై
కనిపిస్తుంటా

వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు అమ్మ కొంగు ఓదార్పు
నాన్న భుజాలపై ఎక్కి
అటక పై పడ్డ బంతి దొరికే వరకు
వదలక  సాదించుకున్న మంకు ఏడుపు
అబద్దం ఆడినప్పుడల్లా భయపడి
చర్చి కిటికిలోంచి
గుస గుసగా సారీ దేవా అని చెప్పిన సమయాలు

కేకు కోసేవరకు అన్నం తినక
పుట్టిన రోజు పండుగకై 
నెల ముందు నుంచే ఎదురు చూపులు

అమ్మ అని రాయడం మొదలు
చదువయిపోయేంత వరకు
నమ్మడం నేర్పిన స్నేహాలు
నమ్మి మోసపోవడం నేర్పిన నేస్తాలు

ఒక్కొక్కటిగా ఏవేవో విత్తనాలు
ఎక్కడెక్కడి నదులో
పచ్చదనం చూసొచ్చే పక్షుల్ని
నేను అనే అరణ్యం లోకి
అనుమతిస్తూ
గాయపడి పాఠం నేర్చుకుంటూ
భంగపడి ప్రతిఘటించి ధైర్యాన్ని
చెంతనే ఆయుధంగా పెట్టుకుంటూ

ఇప్పటి వరకు ఇలా వ్యాపించా
నా స్థలం ఎంత మేరని
నిర్దేశించాడో దైవం
అంత వరకు నేనే నాకు
నా భావాలతో నా ఊహలతో
రమిస్తూ
పచ్చదనం తగ్గనివ్వక
నన్ను నేను
నాకోసం నా లో నాకైన వాళ్ళ కోసం
అడుగులలో అడుగు వెసుకుంటూ
పుప్పొడి వాసన రాసుకొని
సీతకోక చిలుకల గుంపులతో
పరవళ్ళు తొక్కే నదుల పలకరింపుల ముచ్చట్లతో
సాగిపొతున్నా
నాకు నేనే
పుట్టిన రోజు శుభాకంక్షలని చెప్పుకుంటూ




Sunday, August 19, 2012

చాకలి రేవు
----------------
ఆ వీధిలో నేను...
ఎలా వచ్చాను ఇక్కడికి?
దగ దగ మెరిసే కాంతులు
ప్రకాసవంతంగా మెరుస్తున్న
ప్రజలు...

వెనుక నుండి ఓ చేయి
తడుతూ అడిగింది
"సిగ్గేస్తుందా...."?
కళ్ళ నిండా నీటి ఊట...

పెదవ్వుల్లో పొడిచి ఉన్న
మరణ సూదిని తీసేసి
"అవును" అన్నాను...!!

అడుగు వెనక్కి వేయబోతూ...
వంచన కత్తిని ఎదరించి
నన్ను నేను అనచుకుంటూ
నిలబడి అడిగాను
"ఇక్కడే వుంటాను"
అని ...

అటు చూడూ...!!
"ఆ చాకలి రేవును
నా రక్తం నీ కోసం
ప్రవహింపచేస్తున్నా"
అన్నాడు తాను...
ప్రభువా! అనేంతలో
తను కనుమరుగు కాగా

వాలిపోయాను
పరిషుధుల గుంపులో
వస్త్రం
వుదుకుకోని నిలబడ్డాను...
దారి అంచులో నిలబడి
ఈ వింత చూస్తున్నమరొకని
రా అన్నాను!!

ఉదుకు కొనలేను అంటూ
వెళ్ళిపోయాడు
అది చూసి విలపింస్తూ
కేక పెట్టాను
వినబడిందా నీకు...!!
by SURESH JAJJARA
ఏవరి పాదమో గుర్తొచింది (By-Mercy Margaret )
----------------------------------------

రెండు పాదాలు కావాలిగా
నడవడానికి

మరి నాకేంటి ఒకటే పాదం
ఉంది
కాని ఇంత దూరం వచ్చా

వెనక్కి తిరిగి చూసా
ఒకే పాద ముద్రల్లా లేవు
నాది కాని
నాతో నడిచిన
ఇంకెవరిదో
ఈ పాదముద్ర

ఆ పాదానికి ఎదో
గాయం
మేకు దిగినట్లుంది
దారి పొడువునా
రక్తపు మరకలే
నా పాదం వెంట
స్పష్టంగా కనిపిస్తుంది

నా పాదం అప్పుడప్పుడు
నడవక మొరాయించినా
నేను దాన్ని
పట్టించుకోలేదు
రక్తం కారుతున్నా
ఆ మరో పాదం
తనతో పాటు ఆగి
పరామర్శలు చేసిందట
నా పాదనికి
తన భాదని వదిలి

రాళ్లు రప్పలు
కొండలు గుట్టలు
ముళ్ళ కంపలు
గచ్చపొదలు
దాటుతున్నప్పుడు
నా పాదాన్ని
కింద పెట్టనివ్వకుండా
బాధనంతా తనె తీస్కుందట

ఇప్పుడే
పచ్చిక లోకి వచ్చాక
కాని తెలియలేదు
ఆ పాదం నాకోసం ఎందుకింత
కష్టపడుతుందో

ఏవరి పాదమో
తెల్సుకోవాలని చేతిలోకి
తీసుకొని చూస్తే
ఎక్కడొ చూసిన జ్ఞాపకం

ఎక్కడా ?
ఎక్కడా?
హా... గుర్తొచింది
అదే అదే
ఆ కలువరి గిరిపైనా
ఆ సిలువ పైన

పరుగెత్తి పరుగెత్తి
పాపం చేస్తూ
పాప రోగం సోకి
నా కాలు పోగొట్టుకున్నపుడు
ఏడ్చిన ఏడ్పుల్లొ
దేవా యెసయ్యా
అని అరిచిన క్షణాలు జ్ఞాపకం

ఆ స్వరం ఆయనని చేరి
ఆయన పాదం
నా ఒంటి పాదానికి
తోడుగా వచ్చింది
నా కన్నీళ్ళు
ఇప్పుడు ఆ పాదంపై
ముద్దాడుతూ
ఆ స్రవిస్తున్న రక్తం
నా పాప రొగానికి
వైద్యం చేస్తూ ..
(by-Mercy Margaret --17/8/2012 ) —

Sunday, August 12, 2012

Mercy Margaret ll తన పని జరిగించే గాడిద చాలు ll
-----------------------------------------------------

ఒక్కసారి చూడు 
ఆ గాడిద మాట్లాడుతుంది 

****
ఆత్మీయ నేత్రాలు 
మూసుకు పోయినప్పుడు 

అహంకారపు పొరలు 
అంతస్తుల కలలు,ధనాపేక్ష 
కళ్ళను కమ్మినప్పుడు

ఆశీర్వాదానికి వ్యతిరేకంగా 
శాపాన్ని వాడే ప్రయత్నం చేసినప్పుడు 

దైవ స్వరం వినకుండా 
దురద చెవులతో 
హృదయ తలుపులు మూసుకున్నప్పుడు 

వెలుగును చీకటిని కలిపి 
ఒకటిగా చూసే 
దృక్పదాన్ని నింపుకొని 
ఎదురుగా 
శిక్షని చేత పట్టుకున్న దూతని 
చూడలేక 
ఆత్మీయ అంధత్వం 
కనులను మూసేసినపుడు ..

యజమాని ఏంటి? 
యజమానులు భయపడే యజ్ఞుడైతే 
ఏంటి ?
బుద్ధి చెప్పేందుకు 
గాడిదే చాలు !

దేవుని తలంపులు మనవంటివి 
కావని 
గుర్తుచేసేందుకు గాడిదే చాలు 
దారి తప్పిన 
గురి తప్పిన 
పట్టు సడలిన క్షణాల్లో 
మనిషిని 
మంచికి పాత్రగా వాడుకునేందుకు 
దైవ చిత్తానికి వ్యతిరేకులయ్యి 
అసమాధానానికి కారణం అయ్యే క్షణాల్లో 

ఆ దైవానికి 
లోబడని నీకన్నా ..నా కన్నా 
తన పని జరిగించే గాడిద చాలు 

జ్ఞానవంతులం అని విర్ర వీగే మూర్కులకన్నా 
తన పని కొసం వెర్రి వారైన సాత్వికులే చాలు 
by -Mercy Margaret ( 12/8/2012)

Saturday, August 11, 2012


ఈ రాత్రి - ఆయన వాక్యం (by-Mercy Margaret -12/8/2012)
-------------------------------------------------------------


నిద్దర రాని సమయం 
కిటికీలోంచి తొంగి చూస్తే 
ఆకాశం అంతా వెన్నల 

మూసేసిన తలుపులు 
ముచ్చట్లాడుకుంటూ 
లోపలి రహస్యాలు
బయటకి చెప్పుకుంటూ
నవ్వుతూ కొన్ని 
ఏడుస్తూ కొన్ని 
కనిపించి వినిపిస్తునట్టూ 

ఆ ఇంటి  మీద 
పక్షి ఒకటి 
నోరు తెరిచి దేని కోసమో 
ఎదురు చూస్తూ
మూలుగుతూ కనిపించి
నన్ను నాకే గుర్తు చేస్తుంటే

ఎందుకో కళ్ళు 
ఆ గూటివైపుకు మళ్ళాయ్
పరిశుద్ధ గ్రంధం అని 
బంగారు వర్ణంతో మెరుస్తూ 
పుస్తకం 
చదువుమని పిలిస్తే

ఒక్కొక్కటిగా  
పుఠలు పుఠలుగా
తెరిచి చూస్తూ 
చదువుతూ ధ్యానిస్తున్నా

క్రొవ్వు మెదడు దొరికినట్టు 
గుండె జిహ్వకు తీపితగిలినట్టు
వాక్యమనే తేనె 
మన్నాతో కలిపి పెట్టినట్టు 
కాఠిన్యాన్ని సుత్తెలా కొడుతూ
మెత్తగా చేస్తూ 

వాక్యం నాలోకి 
నదులుగా 
ప్రవహిస్తునట్టుంది
ఎండిన దారుళ్ళో
ఎడారి స్థలాల్లో వర్షిస్తునట్టుంది 

చూరుమీది పిచ్చుకకి 
తోడుగా పక్షి వచ్చి కూర్చుంది
నా హృదయ గదిలో 
నా ఒంతరితనపు స్థలాలోకి 
వాక్యం శరీరధారియై 
ప్రవెశించింది

ఇమ్మనుయేలుగా
తొడుగా నిలచి
హృదయాన్ని దున్నుతూ 
మంచినేలగా చేస్తూ 
ధైర్యంగా నన్ను  
కౌగలించుకుంది 

ఈ చీకటి రాత్రి 
వెలుగుల జిలుగులు తోడు చేసి 
మేడ మీది పక్షిలాంటి నన్ను
తన జంట చేసుకుంది
పరిశుద్ధ గ్రంధం  




Thursday, August 9, 2012

యేడ్చుచుపోవు విత్తువాడు
------------------------------
ఆయన 
పిడికిళ్ళ నిండా 

విత్తనాలు పట్టుకొని
ఏడుస్తూ విత్తుతున్నాడు



****

ఆ కళ్ళలోంచి
కన్నీటి చుక్కలు ఒక్కొక్కటిగా
నేలను రాలి
ఆతని బాధని
నేలతో పంచుకుని
గుండె బరువు కాస్తైనా
తగ్గించాలని

****
నేల
పాపం ఏం చేయగలదు
ఆకాశం వైపు చూస్తూ
ఆ కన్నీలని ఆపమని మేఘంతో
చెప్తూ
******
ఏ ఏ విత్తనాలో
తన గర్భంలొకి
చేరుతున్నాయో అని
ఆ నేల ఆసక్తితో గమనిస్తూ

****
ఒంటరితనం
ఓటమి క్షణం
అసహ్యపు అనుమానపు
అర్ధం లేదని జీవితాన్ని నిందించే
ఆశీర్వాదపు లేమితో
దరిద్రం చూసే
ఓపికలేని క్షణాలన్నీ
ఆ " దైవసన్నిధి" అనే
నేలలో నాటుతూ

****

కన్నీటి సిఫారసు
తీవ్రత సన్నిధి నేల నుంచి
విశ్వాసుల స్వరంలో కలిసి
ప్రార్ధన మెట్లెక్కి
ఆవిరిలా ప్రభు ముందు
నిల్చుంది
****
ఆయన తూరుపు గాలిని
పిలిచి
దక్షిణ హస్తంలోని మేళ్ళలో
కావల్సిన తడిని నింపుకొని
వెళ్ళమని సైగ
చెసాడు

*****
కనీళ్ళు సంతొషంగా
దీవెనల వర్షంతో పాటూ
పరుగెత్తి పరుగెత్తి వచ్చాయి
పిడికిళ్ళా నిండా పట్టుకొని
యేడ్చుచుపోతూ విత్తిన
ప్రతి విత్తనాన్ని
తాకయి
****
కోతకాలమొచ్చింది
పంట చేతికొచ్చింది
కొడవలి పట్టుకొని
విశ్వాసపు తొడుగుతో ఓర్పుగా
కనిపెట్టి
పంటకోస్తూ మళ్ళీ కన్నీళ్ళే
"ప్రభుసన్నిధి" నేలపై
కృతజ్ఞత దూపంగా రాలాయి

****
ఇప్పుడు
అతను
సంతోషగానంతో పనలు
మోసుకొని
వెళ్తూ
ఎక్కడ పడితే అక్కడ
విత్తనం నాటి మోసపొయిన
వాళ్ళకి
"దైవసన్నిధి" నేలను పరిచయం
చేస్తూ ..♥
(కీర్తనలు 126:6 పడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును....)
BY-Mercy Margaret (7th agust 2012)

Saturday, August 4, 2012


ఒక గొప్ప స్నేహం నాకు తెలుసు
వింటావా ?
*******************
అంత గాఢమైన కౌగిలి
మునుపెన్నడు లేదు వారిరువురి మధ్య

ఇక ఎన్నటెన్నటికి విడిపోబోతుంటే..
చివరి క్షణాల్లో పెల్లుబుకుతున్న లావా
యెడబాటు తట్టుకొలేక
గుండెలో
పేలుతున్న అగ్ని పర్వతాలు
గుక్క పట్టి ఏడుస్తూ ఇద్దరూ
ఎప్పుడూ కలుసుకునే పొలం
కలిసి కూర్చునే స్థలం కూడా
వారి రోదనని అర్ధం చేసుకుని
మూగ నిట్టుర్పులు విడుస్తూ...

కారణం ?
మూర్ఖుడైన తండ్రి చేతినుంచి
స్నేహితుని కాపాడాలనుకునే ప్రయత్నం
--

ఆ కన్నీళ్ళ సుడిగుండాల్లో
వారి స్నేహనికి పడ్డ దారులు గుర్తుచేస్కుంటూ
బలశాలి ,సంగీతకారుడు ,ప్రియుడు ,సౌమ్యుడయిన
స్నేహితుడు దావీదు
తండ్రి సౌలు ఆస్థానంలో శ్రావ్యమైన సంగీతం వాయిస్తూ
ప్రజ్ఞతో శౌర్యంతో గొల్యాతునోడించి
హృదయాన్ని గెల్చుకుంటే
తనని చూసిన రోజే
నా హృదయం తనతో కలిసిపోతే
పెనవేసున్న బంధం స్నేహ వనం నిండా
గుప్పుమంటూ అలుకున్న పరిమళభరిత సుగంధ
గాఢమైన స్నెహ బంధం మాది

అందుకే నా దుప్పటిని,కత్తిని, విల్లును నడికట్టును తీసి
దావీదు కిచ్చి
ఒప్పందం చేసుకొని ఇరువరం సమమే అని
నా ప్రాణస్నేహితుడుగా తనని
ఉండిపోమని

ఇప్పుడు ఒప్పందం మిగిలింది
నా స్నెహితునితోనే నా స్నేహం కోసం
కాని అమావాస్యనాటి దురాత్మకి లోబడుతూ
నా తండ్రి నాకు చేసిన ప్రమాణం మరిచిపొతూ
నా ప్రాణాన్నే హత్య చేసే ప్రయత్నం తీవ్రతరం చేస్తే

వెళ్ళిపోమంటున్నా
తన తండ్రి దగ్గరికే
వెళ్ళిపోమంటున్నా
నా ప్రాణాన్ని కూడా తనతో తీస్కెల్లమంటూ
యోనాతానుని నిస్సహయున్ని

--
ఇక చూస్తానో లేదో
నా ప్రాణన్ని అని ఇద్దరు రోదిస్తూ
కలిసి తిరిగిన పొలాలు
కలియ తిరిగిన స్థలాలు
కలబోసుకున్న కలలు ఊహలు ఊసులు
కలిసి సాదించిన విజయాలు
ఒక్కొక్కటి నెమరు వేసుకుంటూ

గాలికి కుడా భారమయ్యె నిశ్వాసల
శబ్ధాల్లో రొదనని శ్రుతి కలిపి
ఆలపిస్తూ
చివరి సారి కలిసి ఇష్టమైన కీర్తన
పాడుకొని
చెరోవైపు మళ్ళారు

-------
ఒక విశాద వార్త
దావీదును ఒక్క క్షణం పొడిచేసింది
తన పక్షపు వారి
చేతుల్లో యోనతాను సౌలుల మరణం
రాజరికంలో పుట్టి పెరిగి
గొర్రెల్లు కాచుకునే తనని స్నేహితుని
చేసుకొని
చివరికి తనని కాపడే ప్రయత్నంలో
తన ప్రాణాల్ని లెక్క చెయకుండా
తన కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు
అస్తమించాడు
ఒక గొప్ప స్నేహాన్ని తనకిచ్చి

********
కనీళ్ళ నదులు కట్టలు తెగుతుంటే
మళ్ళీ అదే దృశ్యం
కలువరి సిలువలో నాకోసం
నా స్నేహితుడుగా
యేసు మరణం
నిత్య జీవమిచ్చు క్రమంలో
నా ప్రాణ ప్రియుడుగా వుండడానికి
తనను తాను అప్పగించుకున్న వైనం
ఇంకెవరి స్నేహం తనకు సాటి రాదని
నిరూపిస్తూ
చిరకాల స్నేహం పూయిస్తూ
నా కోసం తపిస్తూ నా జీవం నా సర్వం
నా యేసే స్నేహ మాధుర్యంగా
అంకితమిస్తున్నఆయనకి నా జీవితం ♥
(BY-Mercy Margaret (5/8/2012)
HAppy Friendship day to All of my friends :) ♥ u all ...GBU all :)