Friday, October 25, 2013





||జీవనది || By Mercy Suresh Jajjara
________________________
వర్షం పడుతుంది
ఆయనా.. నాతో మాట్లాడుతున్నాడు.
ఎడతెరిపి లేని వానలా కురుస్తున్న ఆయన మాటల్తో 
ఎండిన నేలలా నోరు తెరిచిన హృదయం
దాహం తీర్చుకుంటుంది.

ఆయన మాట్లాడుతున్నాడు వానా పడుతూనే ఉంది
హృదయారణ్యంలోని ప్రతి మూలల్లో మాటలు వర్షిస్తున్నాయి
ప్రతి నేలని చదును చేస్తున్నాయి
ఎండిన ప్రతి మోడు చిగురిస్తు౦ది
రాలిన ఆకుల చోట కొత్త జీవం ఉబుకుతుంది
ప్రతి అణువు చెట్టులా మారి పాటలు పాడుతుంది

వర్షం పడుతుంది, ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు
విరిగిన ఎముకలన్నీ ఆ మాటలు వింటున్నాయి

ఆయన మాట్లాడాడు లేచి బయటికి రమ్మన్నాడు
శవం ఇప్పుడు శవం కాదు. మళ్ళీ జీవం ఉన్న మనిషి
కరిగిపోయిన ప్రతి కన్ను చూసేలా ఆయన మాట్లాడాడు
చనిపోయిన ప్రతీది నిత్యత్వం పొందుతుంది
ఆయన మాట్లాడుతున్నాడు
వర్షంలా
చినుకుల్లా కురిసే మాటలు నదులయ్యాయి
ఆ నది
జీవనది
ప్రవహిస్తూ నన్ను ముంచింది

అదో ... చూడు ఇప్పుడు
నీవైపే..
నీవైపే వస్తుంది.
____________ (23/10/2013)__________

Thursday, October 10, 2013

|| కాంతి కౌగిలిలో || by Mercy Margaret 
------------------------------------
-'చీకటి ప్రదేశాలు దాటెల్లాలి 
నాకొంచెం వెలుగివ్వు' 
అడిగా ఆ కాటి కాపరిని 

కొంచెం వెలుగో, కాగడ వెలుగో ఎందుకు ? 
ఆయన చేతిలో నీ చేయి వెయ్యి 
చీకటనుకున్నదంతా 
ఏమవుతుందో చూడు అని సమాధానం

మేకులు దించిన చేయి నా వైపు చాపి
ఆయన ప్రశాంతంగా నవ్వాడు

ఆ కళ్ళలోని ఆదరణ చూస్తూ
అతని చేతిలోకెళ్ళిన నా చేయి

వెంటనే ఆ నిమిషం
నిజ ద్రాక్షావల్లిలో అంటుకట్టబడ్డట్టు
ఎండిన నరాల్లో ప్రవహించిన జీవం
మరణాన్ని దాటాను
నేనిప్పుడు వెలుగుకు సొంతమయ్యాను .
________( 11/10/2013)_______
||పొరలు రాలిన క్షణం || by Mercy Margaret 
-----------------------------------------------
కళ్ళు వెలిగింపబడ్డప్పుడు 
ఇప్పుడు చూస్తున్నాను 
అపరిశుద్ధత జాడ లేని పరిశుద్ధ స్థలాల్ని 
అంతే కాదు 

ఏవి సత్యమైనవో , మాన్యమైనవో,న్యాయమైనవో, 
ఏవి పవిత్రమైనవో, రమ్యమైనవో, 
ఖ్యాతిగలవో
వాటిని

ఒక సారి అటు పక్కగా చూసా
నడిచిన దారుల్లో నా ఉనికి తెలుసుకోవాలని

గాడాంధకార లోయ, ఎముకల లోయలో గుండా నడిచిన ఆనవాళ్ళు
శ్రమలోయల్లో గుండా గ్రుడ్డిగా నడిచొచ్చిన
దాఖలాలు
దారి లేని కీకారణ్యాల్లో, చనిపోయిన జంతు శవాలపైగా
హతుల రక్త సిక్త దేహాలమడుగులో పడిన
అడుగుల ముద్రలు , కనబడలేని దుర్గంధ వాతావరణాలు
చీకటి అంటుకున్న పాదాలు వెలుగులో స్పష్టంగా కనబడుతున్నప్పుడు

కోల్పోయిన సమయాన్ని గూర్చిన చిరు చింతన
ఇన్నాళ్ళు ఆలస్యం ఎందుకు చేసానని ?
అయినా
పర్లేదు దమస్కు మార్గానికి ఇపుడు
చేరానన్న ఆనందం

రాలిపోయిన పొరలు మరెప్పుడు కనిపించవిక
అదో
ముగిసిన యుద్ధం
కడ ముట్టించబోతున్న పరుగు పందెం
జీవకిరీట౦ పట్టుకొని నిరీక్షిస్తున్న దీపస్థంభం
_________________(8/10/2013)____

Tuesday, October 1, 2013

|| ఓ సంభాషణ || by Mercy Margaret
-----------------------------
కళ్ళ లోంచి రెండు కన్నీటి చుక్కలు రాలి పడబోతుండగా
నువ్వు నీ చేతుల్లోకి వాటిని తీసుకోవడంతో
నీ కళ్ళలోకి చూసాను
చిరు నవ్వు నవ్వావు

ఎందుకు నవ్వడం నా పరిస్థితి నీకు తెలియదు
ఇప్పటికి నన్ను ఒంటరిగా వదిలేయ్ అన్నాను
నువ్వు మళ్ళీ నన్ను చూసి అంతే జాలిగా నవ్వావ్ 

నువ్వూ ఒకసారి ఏడ్చావ్ మరిచిపోకు అన్నాను
అవును అంటూ తలూపావ్
కళ్ళు ఒకసారి మూసుకోమని ఏ౦ కనిపిస్తుంది అని అడిగావ్
చీకటి అన్నాను ..
ఇప్పుడు అని అంటే లోకం అన్నాను

వెంటనే నువ్వు నా ముందుగా నిలబడి "నేను కనబడుతున్నాను "
అంటావ్ అనుకున్నానని మళ్ళీ దయగా నవ్వుతూ
నీ రెండు చేతులు తెరిచావ్ నా కన్నీటి చుక్కలు ముత్యాలయ్యాయి
కాని

నాకు గుర్తుంది ఆ ముత్యం నీ అరచేతి గాయంలో ఇరుక్కోవడం
వెంటనే నా దుఖానికి కారణం ఆవిరైయ్యింది
నీ రెండు చేతులను తెరిచి ముద్దాడాను
ఆ స్పటిక సముద్ర తీరానా
జీవ వృక్షపు నీడలో ఫలాలు తినడానికి రమ్మన్నావ్
అంతే

మోకరిల్లాను ఆ పాదాలపై చీలలు చేసిన గాయాలు
నన్ను చూసి నవ్వాయి
నేను మాత్రం వాటిని ఎప్పటికి వదల దలుచుకోలేదు
అందుకే
పరదైసులోకి రావడానికి నీ అడుగుల జాడల్లో ఇలా పయనమై వచ్చాను

--------------------------(30/9/2013)--------