Monday, November 18, 2013

||ప్రతి రోజూ చాలిన నీ కృప || 
_________________________
ప్రతి రోజు ఆ పాత్ర నా ముందు పెట్టబడుతుంది 
నీ ముందు మోకరించి ప్రార్దించిన సమయాన 
ఉచితమైన నీ మహాకృప 
దాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది

ప్రతి రోజు ఆ పాత్రలో ఏముందో చూడాలని నా ప్రయత్నం
నువ్వేమో నన్ను చూడనివ్వక
ఎత్తైన కొండపైకి నా కాళ్ళను లేడి కాళ్ళలా చేసి
పరుగెత్తిస్తావ్
నీ అధ్బుతమైన సృష్టిని, మహాధ్బుతమైన నీ చేతిపనిని చూపి
నన్ను నివ్వెరపరుస్తావ్
ఆ పాత్రనీకప్పగించాక అది చల్లబడుతుందెందుకని
నేను అడగడం మర్చిపోతాను .

ఈ ఉదయాన్నే కళ్ళు తెరిచే లోపు ఆ పాత్ర నా ముందంచబడి౦ది
నేను నీకు మొదటి కృతజ్ఞతలు చెప్పలేదు
ప్రార్ధనతో నీతో అనుసంధానించబడలేదు
ఆ పాత్రలో ఏముందో చూడాలని కుతూహలం
మూతతీసి చూసా
వేదనకరమైన , మరణకరమైన విషం,
వెంటనే నేను నిన్ను పిలిచాను నీ కృప పరుగెత్తుకొచ్చింది
రోజుటిలాగే నా నుండి అది తీసి ఆ పాత్రని
నీ ప్రేమతో కరుణతో నింపింది.
భయంగా వడలిపోయిన నన్ను హత్తుకుంది.
మరో రోజుకు నీ కోసం నన్ను సిద్ధంచేసింది

_____________ (06/11/2013)_______
||నదిని అన్వేషిస్తూ || by Mercy Margaret
___________________________________
ఒక నది ఇక్కడ ప్రవహిస్తూ ఎప్పుడు పచ్చదనాన్ని కంటూ ఉండేది.
నదినానుకుని నేల, నేల నుండి వేళ్ళు పాకి అడవి, అడవిలో ఆణువణువూ చెట్లు చేమలు
పక్షులు,పశువులు. నిత్యం నూత్న కోలాహలం పచ్చపచ్చగా వినవస్తూ ఉండేది.
చెట్లు పైపైకి పెరిగి ఆకాశంతో అల్లుకుపోయే పందిళ్లను వేసి మేఘాలను కదలకుండా బంధించి
వర్షంతో అందమైన స్నేహం చేసేవి.

నాకిప్పుడు దాహమేస్తుంది . తాగడానికి నీళ్ళు కావాలి. నదిని ఎండిపోజేసిన 
విషవాక్యాలను శపిస్తున్నాను. నది ని ఎడారిగా చేసిన ఆలోచనల రాతలను బహిష్కరిస్తున్నాను.
జీవం ఉట్టిపడే నది కోసం నేను అడవి దాటి అన్వేషిస్తున్నాను.

అడవిలో ఎండిపోతున్న చెట్ల ఆత్మలను దోసిట్లో పట్టుకుని బయలుదేరాను..
విషం చిందించిన అక్షరాలూ క్షరమైయ్యేట్టుచేసే
విషం దొరికే తావు ఎక్కడుందని వెళ్తున్నాను. ఈ అడవిని ఇక్కడే ఒదిలి
నదిని వెతుక్కుంటూ మళ్ళీ పచ్చగా పాలు తేనెలు ప్రవహించే తావులున్న
నదికోసం జీవనది కోసం వెళ్తున్నాను.
నా నీళ్ళు తాగువాడు మరెప్పటికీ దప్పిగొనడన్న నది కోసం వెళ్తున్నాను.

కృష్ణ, గోదావరి తుంగభద్రలు దాటి. గంగా సింధు బ్రహ్మపుత్రలు దాటి.
అమెజాన్, నైలు, మిస్ససిపి నదులు దాటి. సిక్క్వే రెడ్ వుడ్ ,జాగ్ ఫాల్స్ అడవులు దాటి.
మహాగ్రంధాలు, ఉద్గ్రంధాలు దాటి, ఆదియందు ఉన్న వాక్యం వినబడుతున్న శబ్దం వైపు,
కలుగునుగాక అన్న మాటవైపు. భూమి నిరాకారంగా శూన్యంగా ఉండి చీకటి అగాధ జలములపై కమ్మిఉన్నప్పుడు,ఆ జలముల మీద ఆ నది ఆత్మ అల్లాడుచున్న స్థలానికి

నీటి వాగుల కొరకు తృష్ణగొన్న దుప్పినై ..
__________________________


Friday, November 8, 2013

వస్తావా నేస్తం ..!
________________
కొంత మనశ్శాంతి పంపుమందాం శాంతమూర్తిని 

ఎలియా వద్దకు పంపిన కాకితో  మన  కోసం 

ఎక్కడో రాజుకున్న నిప్పు అడవిని తగులబెడుతున్నప్పుడు  
అరణ్యంలో ఆడుకునే 
చిన్ని చిన్ని ఉడతలు కుందేళ్ళు 
చెంగున గెంతే  లేళ్ళు 
ఆ విహ్వలజాలాల ప్రతాపానికి బలి కాక ముందే 
ఓ మేఘం నిండా శాంతిని నింపి మన హృదయారణ్య౦లో 
కురిపించమని వేడుదాం 

తండ్రికి చిక్కకుండా  దాచి చివరి వీడ్కోలు పలికిన
యోనాతాను 
దావీదుతో  పలికిన మాటలు విన్న 
అక్కడి  చెట్లు కొండల వద్దకెళ్ళి 
యదార్ధ  స్నేహపు పలకరింపుల 
తడి తెలుసుకుని వద్దాం 

నుదుటి మీద ముద్దు పెట్టి అప్పగించినా  
అకేల్దమలో యూదా రక్తం ఏమని రోదిస్తుందో 
రుజువులడిగివద్దాం 

వస్తావా.. నేస్తం ... 

క్రిస్టమస్ కోసం సిద్ధపడుతు 
క్రీస్తుని మనసులో నింపుకుందాం
పశుశాలలో వెలిగిన చిరునవ్వులను దోసిలిలో 
పట్టుకుని 
గాయమైన హృదయానికి లేపనంగా రాసుకుందాం