Wednesday, October 22, 2014

| నా దీపమును వెలిగించువాడు | Mercy Margaret 
--------------------------------------------------------------
నీ గురించి పాడటానికి నా దగ్గర ఒక్క కొత్తపాట లేదు 
నీ గుమ్మంలో ప్రవేశించక ముందు 
వెలుగునదిలో నువ్వు నన్ను ముంచి తీసాకా 
పాతపాటలతో నిన్నెలా చేరను ?

నా దారిపొడవునా 
చెట్లకొమ్మలు రోజూ కొత్తపాటలను 

పూయించి నీ సన్నిధికి పంపడం చూసాను
ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలను
రోజూ ఓ కొత్తపాటతో వెలిగించడం చూసాను
నీ పేరు రాసున్న ప్రతి చోట కొత్త సంగీతం నదులై
ప్రవహించడం చూస్తున్నాను
అంతేనా
తల్లి పిచ్చుక తన చిట్టిపిచ్చుకకు నీ స్తుతికీర్తన
నోటికందిస్తుంటే
నా నోట ఏ పాట లేదని చింతిస్తూ వచ్చాను

నీ గుమ్మంలో ప్రవేశించాక
తేజోమూర్తి ..!!
కోటిసూర్యప్రకాశుడా ..!!

నా మనో నేత్రాలు వెలిగించబడ్డ క్షణాన
కొత్త పాటొకటి నాలోంచి ఇప్పుడే పుట్టింది
కొత్త రాతిని
కొత్త పేరొకటి నువ్వు నాకిచ్చిన ఈ క్షణాన
వెలుగువై నీవు నాలో నిండిన క్షణాన ఇప్పుడే తెలిసింది
నీ సన్నిదే నాకు దీపావళని
నీవు నాతో ఉన్న ప్రతి క్షణం
నే దీపమై వెలుగొందుతానని .

-------------- 22/10/2014 -----------


2కోరింథీయులకు 4:5 _"అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను."
ఎఫెసీయులకు 5:9 _"వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది."