Wednesday, December 19, 2012

లోక సంద్రంలో దిక్కు తెలియక 
ముంచెత్తుతున్న అలలకు, గాఢాంధకారానికి  భయపడి 
అయ్యా అని పిలవగానే 
శరీరధారియై సహాయానికొచ్చిన 
దైవం వాక్యం 

ఎండి  రాలిన  ఆశల ఆకులు కొట్టుకుపోతుంటే  
చిగురులు వేయలేక కృంగుతుంటే 
తనలో అంటుకట్టుకున్న
ద్రాక్షావల్లి వాక్యం 

అలసి సొమ్మసిల్లి 
ఆత్మ తృష్ణతో జీవానికై వెతుకుతుంటే  
పాపానికి బానిసైన బ్రతుకును విడిపించవచ్చి 
రక్తం ధారబోసి, సర్వాంగ కవచం స్వాతంత్ర్యం ఇచ్చిన 
రక్షణ వాక్యం  

కలుగును గాక అంటూ సృష్టిని చేసి 
సర్వం మంచిదనియెంచి సంతోషిస్తే ,
దారి తప్పిన మానవాళిని దయతో హత్తుకొనడానికి    
ఆకాశానికి భూమికి మధ్య ఎత్తబడిన ఇత్తడి సర్పంలా 
సిలువకెక్కి రక్షణనిచ్చిన 
ప్రేమ వాక్యం 

అడుగు అడుగున తోడుంటూ 
జిహ్వకు  జుంటి తేనెగా , సరి చేయు సుత్తెగా , 
తీర్చి దిద్దు అద్దంగా ,నా పాదాలకు దీపంగా 
మార్గమై సత్యమై జీవమై 
చీకటి నుండి వెలుగులోకి దాటింపగా వచ్చిన 
పరిశుద్ధ అగ్ని ,పరిశుద్ధ వర్షం  , రెండంచుల 
ఖడ్గం వాక్యం 
|| క్రిస్మస్ అనగానే || by Mercy Margaret
---------------------
క్రిస్మస్ అనగానే 
ఏం గుర్తొస్తుంది ??

నాలో నిండిన చీకటిని 
ఒక చిరు నవ్వుతో చీల్చేసి
పసి బాలుడిగా
పశుశాలలో పవళించిన
నా యేసు నాధుని
బోసినవ్వుల సూర్య కాంతి

ఎండిన మొద్దుకు చిగుర్లు మొలకెత్తిస్తూ
ఆకాశంనిండా కొత్త నక్షత్ర కాంతి నింపి
ఆకాశాన్నీ భూమిని మళ్ళీ నవ్విస్తూ
జోల పాట వినిపించే తన చూపుల కరుణ వర్షం

క్రిస్మస్ అనగానే
ఏం గుర్తొస్తుంది ??

హృదయంలో ఎండిపోయిన నదులు
తిరిగి ప్రవహింప జేసేందుకు
కడుపులో మళ్ళీ జీవ జలం
పుట్టింపవచ్చిన
సమాదానమైన జీవపు ఊట

తలనుండి అరికాలు వరకు
పచ్చిపుండ్లతో నిండిన నా శరీరాన్ని
స్వస్థపరచడానికి దెబ్బలకు సిద్ధపడ్డ
పరమ నిబంధనకై దిగివచ్చి
దేహం గా మారిన వాక్యం

క్రిస్మస్ అనగానే
ఏం గుర్తొస్తుంది ??

పాపపు జిగటగుంటలో పడి
కాళ్ళు బయటికి తీయలేని స్థితిలో ఉన్న నాకోసం
అనంతమైన ప్రేమతో తన సొగసుని సురూపాన్ని
ధారాబోసి
సిలువకెక్కి మరణించిన ప్రేమ

నను
తన పరిమళ వాసనగా చేయాలని
తానే దహనబలిగా యాగమైన
యేసుని కృప గుర్తొస్తుంది
పడిపోయిన క్షణాలని తిరిగి నిర్మిస్తా రమ్మంటూ
తను ప్రేమతో పిలిచే మెల్లని స్వరం గుర్తొస్తుంది
----------------- ( 19/12/2012 ) by mercy margaret -------

Saturday, December 8, 2012

ll నా పౌర స్థితి ll  by  mercy  margaret 
-----------------------------------------
నమ్ముతున్నా
నా దినములన్ని
ఆయన గ్రంధములో వ్రాయబడి ఉన్నవని 
ఈ లోకంలో నేను పరదేశినని
నా పౌర స్థితి పరలోకమందున్నదని
 ఇక్కడ నే  కేవలం యాత్రికురాలినని

నిర్ణయింపబడిన దినములు ముగిసిన రోజున

నా కళ్ళు మూయబడతాయని 
నా నాసికా రంద్రములగుండా ఊదిన ఆయన ఆత్మ
ఈ దేహపు గుడారాన్ని విడిచి బయటకొస్తుందని 

నేను లేని దేహాన్ని చూస్తూ

నా వాళ్ళు అనబడే వాళ్ళందరూ , కాని వాళ్ళు కూడా
ఆ దేహాలలో ఉండే ఏడుస్తుండగ 
మట్టికి మట్టై పోయే ఈ దేహాన్ని నేను మరి వింతగా 
చూస్తూ 
నేను ఎవరో అప్పుడు ఇంకా స్పష్టంగా తెలుసుకుంటానని 
దేవుని ఉద్దేశ్యం ఎలా నెరవేరిందో బేరీజు వేసుకుంటానని  

అందమైన పూలను

వదిలిన నా  డొల్ల శరీరంపై పెడతుంటే చూసి నవ్వుకుంటానని 
వెతికి వెతికి నా ఊసులన్ని చెప్పుకుంటూ
మాట్లాడుకుంటూ రోదిస్తుంటే 
నా పరమ తండ్రితో ఉండే సమయం వచ్చిందని నేను 
ఆనందిస్తానని 

ఆత్మీయ సత్యాలన్నీ తెలుపబడుతుంటే 

ఆశ్చర్య పోతానని 
నా దినములు లిక్కించుటకు  నాకు నేర్పుమని 
దావీదు 
ఎందుకన్నాడో ఇంకా బాగా అర్ధం చేసుకుంటానని 

పరదైసు వైపుకు  వెళుతూ  

భూమిని  చూస్తూ వింత వింత అనుభూతి పొందుతానని 
నా కన్నా ముందు చేరిన  వారితో 
పరలోక సత్యాలు, ఆత్మీయ లోతులు తరచి తరచి తెలుసుకుంటానని 

ఆహా ఆహా 


మేఘారూడుడై  రానున్న ప్రభువు నేదుర్కోనుట ఇంకెంత 
ధన్యతో కదా !
నాధ  ఇంకెన్నాళ్ళు అని హతసాక్షులైన పరిశుద్దుల  స్వరంతో 
స్వరం కలపడంకన్నా గొప్ప భాగ్యం ఏముంది కదా ?

ఆ అనుభవాలకై హృదయం ఎదురుచూడటం 
బహు బాగుంది  కదా..!? 

నా మనసా యెహోవాను సన్నుతించు 

నా అంతరంగమందున్న సమస్తమా ఆయన 
నామాన్ని స్తుతించు ..!!


------------------------- (8/12/12)-------------------

Friday, November 30, 2012

l l తమసోమా జ్యోతిర్గమయా l l by Mercy Margaret
--------------------------
నా హృదయం
విరిగిన ప్రమిద
దీపానికి పనికి రాను

త్రొసివేయబడి
త్రొక్కబడుతూ
రోదిస్తూ ఇలా పెంటకుప్పపై

ఒక స్వరం అడుగుతుంది

ఆ విరిగిన హృదయమే కావాలని
చెల్లా చెదురై విరిగిపడిఉన్న
హృదయ ప్రమిదను
ఆరిపోయిన ఆత్మ దీపాన్ని
మళ్లీ నేను వెలిగిస్తానని
పనికిరాదని ప్రక్కకు నెట్టిన
నిన్నే వాడుకుంటానని

ఎవరని అడిగా

పరమకుమ్మరన్నాడు
లోకానికి వెలుగును
నిన్నూ వెలిగిస్తానన్నాడు
ఉన్నపాటున
సమర్పించుకున్నా
అలాగే
నన్ను పిలుస్తున్న జీవపు వెలుగుకు
నా యేసునకు ..
---------------by Mercy Margaret (13/11/2012)-------
ll చెవి గలవాడు ll BY - Mercy Margaret
---------------------------------------------
మనుషుల మాటలేమి వింటావ్ ?
ఉప్పెక్కువైన కూరలే అవి
కుళ్ళి పోయిన పండ్లే అవి
పలహారానికి కూడా పనికి రావు


చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు
వినుగాక అని,
పదే పదే పలికిన క్రీస్తు ,ఆయన శిష్యులు
చెవులేవి వింటే బాగో
వేటిని భుజిస్తే ఆత్మకు క్షేమమో
ఖచ్చితంగా తెలిసే రాసారుగా !?
వాటిని గ్రహించే పలికారుగా !?

రెండు చెవులు గలిగి నరకంలో పడే కన్నా

ఒక చెవితో పరలోకం చేరడం మిన్న అనిన ప్రభు
మాటలు
గుర్తున్నాయా !!
నేస్తం ??

జీవం కలిగిన ఒక్క మాట

జీవాదిపతి పలికే ఒక్క మాట చాలదా !?
చనిపోయిన శవాలు సమాధి నుంచి జీవంతో లేచి రావడానికి
అంగవైకల్యం ఆమడ దూరం పరుగెత్తడానికి

క్రీస్తు మహిమ క్రీస్తుకివ్వలేని లేని

ఏ గుంపులో పడితే ఆ గుంపులో చేరి
అద్భుతాలు , ఆశ్చర్యాలంటేనే విని

దిద్దుబాటు ప్రసంగాలను దురద చెవులతో దులిపేస్తూ

ఎంత నిరీక్షణ వెనకేసుకున్నావ్ ?
పరలోకపు నిచ్చెన నీ ముందే ఉంటె
వినలేని చెవులతో ఇంకెంత దూరం పరుగెడతావ్ ?

రా ..!! ఇక చాలు

మనుషులను
మట్టి మాటలను వినడం మాను
చెవులు గలవాడు
ఆత్మ చెప్పుచున్న సంగతులను
వినును గాక ...
--------------- by mercy margaret ( 24/11/2012) -------
ll ప్రభువు నీ మార్గంలో ll by Mercy Margaret
-----------------------------------------------------
నీకోసం ఒక మేడి చెట్టు వెతుక్కో
ప్రభువు నీ దారిలో రాబోతున్నాడు
హృదయంలో

ఆత్మలో
మరుగుజ్జుగా ఉండి
ఇన్ని రోజులకి చూడాలన్న ఆశ కలిగిందిగా
ఇంక ఆలస్యం ఎందుకు ??

నీ గుండె జాగ్రత్త ఆయన నీవైపు చూస్తే

నీ కళ్ళతో ఆయన కళ్ళు కలిపినప్పుడు
ఏమవుతావ్ ??
ఆ చెట్టు మీద ఉన్నావని మర్చిపోకు అక్కడే ఉంటే
ఆయనని ఇంటికెలా ఆహ్వానిస్తావ్ ??

చూచి

పేరు పెట్టి పిలిచిన వెంటనే దిగు
నాకు తెలుసు
నాలాగే నీ కాళ్ళు వణుకుతాయని ..!!

కృప నీ వెంబడి నడుస్తున్నప్పుడు

హృదయం మండుతూ మలినం మసైయ్యేప్పుడు
బాధని కప్పుతూ
ఆయన మాటలు నిన్ను ప్రేమతో కౌగలిస్తున్నప్పుడు
ఆయన గుండెనే ఆనుకో
నిత్యత్వం నీ హృదయంలో కొచ్చి
జీవ జలపు ఊట కడుపులో పుడుతుంది
ఆయన కోసం నీ దాహాన్ని తీరుస్తూ ..

నాలా నువ్వు మార్పు చెందినప్పుడు

ఆయన పరలోకంలో విందు సిద్దం చేయిస్తాడు
నువ్వు ఆయనతో కలిసి భోజనం చేస్తావ్
అప్పుడు నన్ను అబ్రహాము కుమారుడనన్నాడు
ఇప్పుడు నిన్ను తన కుమారుడిగా చేసుకుంటాడు
ఇంకెందుకు ఆలస్యం

ఈ జక్కయ

మాటలు
విని బయల్దేరు .....!!! ప్రభువు నీ మార్గంలో
రాబోతున్నాడు..
---------------------by Mercy margaret (18/11/2012

Friday, November 2, 2012












ఆటలాడిస్తుందెవరో??
---------------------------
హారికేన్లు
టోర్నడోలని
సముద్రాన్ని, గాలిని
ఆటలాడిస్తుందెవరో??

నీలం , కత్రీనా శాండీలని
అందమైన పేర్లతో
ఆ తుఫానుల కు
ఆగక
ఆకాశాన్ని వర్షించమని
తూములు నింపి
పంపిందెవరో??

త్సునామి అనే పేరుతో
వెన్నులో
వణుకు పుట్టించిన
ఉపద్రవానికి పేరు పెట్టిన
శాస్త్రవేత్తేనా
ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటే
గుండెలు మైనపు క్రొవ్వత్తులు కావా
ఎందరికో ??

అదే అదే ఆ రోజు
నలువది పగుళ్లు నలువది రాత్రులు
ఆగకుండ కురిసిన వర్షం
సృష్టిని   జలమయం చేసిన
దేవుని ఉగ్రతా ప్రవాహం
గుర్తుందా??
నోవాహను నీతిమంతుడి కుటుంబం తప్ప
కొలతలతో ఓడ కట్టేందుకు
దేవుని స్వరం విన్న ఒక్క నీతిమంతుడి
కుటుంబం  తప్ప మిగిందేంటి??
జ్ఞానం నీ సొత్తు అనుకుంటున్న నేస్తం !?

ఇప్పుడు చెప్పు?
హారికేన్లు
టొర్నడోలు
త్సునామి అని జలప్రళయాలకి
 పేరుపెట్టే నేస్తం
ఆనాటి ప్రళయానికి ఏ పేరు పెడతావ్..??.
పెట్టగలవో లేదో కాని
రక్షణ గుర్తు ఇంద్రధనస్సు ఇంకా
సాక్ష్యం ఇస్తూ ప్రశ్నిస్తూంది చూడు
నీ జ్ఞానం దేవుని ముందెంతని ??