Wednesday, March 6, 2013


|| ఆయన పాదాలు ముద్దాడా !! ||by Mercy Margaret
----------------------------------------
నేను ముద్దు పెట్టుకున్నాను
అవును నేను ముద్దుపెట్టుకున్నాను
ఆయన పాదాలు
పరిసయుడైన సీమోను ఇంట్లో

అందరు చూసే వెలిచూపులను దాటుకుని
సమూహం మధ్యలోంచి దారి చేసుకుని
ఆ ఇంట్లోకి వెళ్తుంటే
ఎన్ని గుస గుసలో నా గురించి
ఎన్ని తీర్పులో వారి స్వనీతి పెదవులనుంచి

వెనక నుండి భోజనానికై కూర్చున్న
ఆయన పాదాల్ని చూసి ముట్టుకోగానే
మురికికూపమైన హృదయంలో శుద్ధీకరణ,
పశ్చాత్తాపపు కొలిమిలో కాల్చబడుతున్నట్టు హృదయం
కడగబడుతున్న ఆలోచనలు కన్నీరే దానికి సాక్ష్యం
ఆగకుండా కన్నీరు .... ఆయన పాదాలపై ప్రవహిస్తూ తడుపుతూ

ఆయన తప్ప అక్కడున్న వారి
చూపులు మాటల , ప్రశ్నల సందేహాల
కొక్కాలు, కొరడాలు నాపై జులుం చేస్తున్నా
నా ముందున్న రక్షణ , నా నిరీక్షణ నన్ను
చీకటి లోంచి వెలుగువైపు దాటిస్తున్నట్టు౦టే
సమాధానం , విడుదల విస్తార జలప్రావాహంలా నన్ను ముంచేస్తుంటే
నాకు ఆయన పాదాలు మాటలు తప్ప ఏమి కనిపించవు విన్పించలేవే!!

నా కన్నీటితో పాదాలు కడిగి
తల వెంట్రుకలతో తన పాదాలు తుడిచి
ఆయన పాదాలు ముద్దు పెట్టుకుని
ఇంతవరకు నావైపు ఆకర్షించేందుకు వాడిన అత్తరు మొత్తం
నాకింకవసరం లేదని ఆయన పాదాలకు పూసా

ఆయన నా విశ్వాసాన్ని ఘనపరిచాడు
నా హృదయాన్ని సమాదానపు ఊటలతో క్రొత్తగా చేసి
నన్ను నన్నుగానే స్వీకరించి
పాపాత్మురాలని నన్ను తరిమే మాటలనుంచి నాకు విముక్తినిచ్చి
యేసు అనే తన పేరుని
నా జీవితంలో యదార్ధం చేసాడు.
--------------------------- (27/2/2013)---------
 

Sunday, February 10, 2013

‎||దేవుడు గీసిన నా ప్రణాళిక || by Mercy Margaret 
----------------------------------------------------
నేను 
తన రెక్కల నీడలో దాగినప్పుడు 
ఏ గ్రద్ద నా కోసం చూస్తేనేమి ?
ఏ పాము నన్ను మ్రింగాలని తిరగాడితే నేమి ? 

ప్రశ్నల ఉరిబిగించి గొంతును కోసి 
పొడిచి పొడిచి 
నా రక్తాన్ని పరిశుద్ధమా ?? అపరిశుద్ధమా ? అని 
పరిక్షిమ్చాలని చూస్తే 
హేబెలు రక్తం మొరపెట్టినట్లు 
భూమిలో నుంచి కూడా 
నిస్పక్షపాతి అయిన దేవుని న్యాయం చేయాలని 
అడగడం మానలేను కదా 

ఇంతకు 
నీ భాద ?
నా ఆత్మ గురించా ? లేక 
దేవుని చిత్తం తప్పు అని నిరూపించి ఓడిపోవడం గురించా ?
నా అడుగులు ఇంకా ఆయన బండపైన స్థిరంగా ఉన్నాయి ఏమిటని 
అలజడి రేగుతున్న నీ హృదయాన్ని ఎలా నిమ్మళింప చేయాలనా ?
జీవమిచ్చిన దేవుడు గీసిన నా ప్రణాళిక నీకు రుచించక పొతే 
నేనేం చేయాలి ??

పర్లేదు 
నీలాంటి వాళ్ళు నాకు అవసరమే 
ఇంకా ఇంకా దగ్గరగా యేసును చూడడానికి 
నాకు అవకాశం ఇస్తున్నావ్ !!

శోదింప బడిన మీదట 
నేను సువర్ణంగా మారుతూ 
నీకు కృతజ్ఞత చెబుతాలే 
నేను సువర్ణం అవడానికి నువ్వు పూనుకోవడం 
గుర్తు చేసుకుని 
రెండు మాటలు నీ గురించి దేవునికి కూడా 
విన్నవిస్తాలే !!
-------------------------( 10/2/2013 )---------

Wednesday, February 6, 2013


||ఒక్కసారి ఆగు || by mercy margaret
---------------------------------------------
1.
ఎందుకు నడవడం ??
దుష్టుల ఆలోచనల ప్రకారం
ఎందుకు నిలబడడం ??
పాపులు వెళ్ళే ఆ మార్గంలో
ఎందుకు కూర్చోవడం ??
అపహాసకులు ఎగతాళి చేసే వాళ్ళు కూర్చుని
పారించే ఆ మురికి స్థలాల్లో
ఎంత ఆనందం వస్తుందని ?
ఎంతటి హాయి నీ హృదయాన్ని నింపుతుందని ??

2.
అహోరాత్రము
దేవుని లేఖనాలను , వాక్యాన్ని , ధర్మశాస్త్రాన్ని
పఠించి , ధ్యానించి
దానిలో ఆనందించు
అప్పుడు నీవు ధన్యుడవవుతావ్

3.
ధన్యుడవుగా
ఆ ధన్యత ఎలా ఉంటుందో తెలుసా ??
నీటి కాలువ ప్రక్కనే నాటబడి
ఎప్పుడూ పచ్చగా వాడిపోని ఆకులతో ,
ఏ కాలపు పండ్లు ఆ కాలంలో కాస్తూ
అన్ని పనుల్లో సఫలత పొందే
చెట్టులా

4.
కాని
దుష్టుడు ??
పొట్టులా
గాలికి చెదరగొట్ట బడే వాడిలా ఉంటాడు

5.
వీళ్ళకు
న్యాయవిమర్శలో నిలవలేరు
నీతిమంతుల కోసం నిర్దేశించబడ్డ సభలో
పాపులకు చోటు లేదు

6.
గుర్తుంచుకో
నీతి మార్గంలో నడిచే వారిగురించి యెహోవాకు తెలుసు
అలాగే
దుష్టత్వపు మార్గంలో నాశనానికి వెళ్ళే వారిగురుంచి కూడా ..
-------------------------------------------------------
(" ఒకటవ (1)కీర్తన " మూలం )
-------------------------------------------------------
 

Wednesday, January 9, 2013

||పాతవి గతించి సమస్తం కొత్తవవుతాయి || by mercy margaret 
---------------------------------------------
కలలన్నీ చింపి చుట్ట చుట్టి 
విసిరి కొడ్తున్నందుకు 
గోడలనిండా మరకలే ..

పాడై పగుళ్లతో
కాలిపోయిన గోడలతో
కలలను చంపిన మరకలతో
ప్రేమ అడుగంటి , మోసపు అడుగుల మరకలతో
ఒంటరితనపు సాలె గూళ్ళు
అల్లుకుని '
అసహ్యంగా ఉన్న నా హృదయపు ఇంట్లో
ఒక్క దాన్నే తిరుగుతున్నప్పుడు

బయట ఎవరో అరుస్తున్నారు
"ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి
పాతవి గతించి సమస్తం కొత్తవవుతాయి " అని

నవ్వుకున్నాను
యిలా ఉండడం అలవాటైయిందిగా

* * *
ఎప్పటినుంచో నా హృదయతలుపు
తడుతున్న శబ్దం
అసహనంగానే తీసా

ఎదురుగా ఆయన
తల మీద ముళ్ళ కిరీటం
వంటి నిండా గాయాలు
నాకు నీ హృదయం కావాలి ఉండటానికి ఇస్తావా ?? అడిగాడు
చెడిపోయిన ఇళ్ళని , పనికి రాని చోటని ,
అసహ్యాన్ని హృదయంపై చిమ్మి ఉమ్మి
వెళ్ళిన వారే అందరు
ఈయనెవరు ?? ఈ పాడయ్యిందే కావాలంటున్నాడని
సరే రమ్మన్నాను

అంతే
ఆయన అడుగుపెట్టిన క్షణం నా హృదయం నూతనత్వంతో
తన్మయత్వం చెందింధీ
మళ్ళీ కొత్తదైన పరిమళంతో గుభాలింపులు నింపుకుని
ప్రేమ చిగురులు వేసి చీకటి పారి పోయింది

ఇప్పుడు నేను ఆయనతో రోజు కలిసి భోజనం చేస్తూ
అడిగిన వారికి చెపుతుంటాను ఆయనెవ్వరు?? అంటే

పనికి రావని విసిరి కొట్టిన వాటిని బాగు చేసే ఇంజనీరని 

Saturday, December 29, 2012

||"అమ్మా " అని ఆయన నన్ను పిలిచాడు || by mercy margaret 
----------------------------------------------------
1.
ఈయనెవరో ఈయన దగ్గరకి లాక్కొచ్చారు అనుకున్నా
పాపం చేసి పట్టు బడ్డాను కదా 
అందరు మగవాళ్ళ లాగే ఈయన మగమనిషైనా 
ఆ ముఖంలో ప్రశాంతత
ఆ ముఖంలో తేజస్సు

2.
నా జుట్టు పట్టుకుని ఆయన దగ్గరకి ఈడ్చుకొస్తుంటే
నేను కాదు
గాయాలు మాట్లాడుతున్నాయి నా ఒంటి మీద
నేను లేను
ఒక పాపాత్మురాలిగ మాత్రమే మిగులున్నా
ఆయన పాదాల దగ్గర

3.
అందరు అతి పరిశుద్దులుగా
ఆయన ప్రవర్తన వెలికితీయ వచ్చారు
ఆయన మాటలను ఇంక్కొన్ని ఒలికించి దైవత్వాన్ని తెలుసుకోవాలని
మగ అనుకునే వారంతా కూడి నన్ను లాకొచ్చి
-"
మోషే ధర్మ శాస్త్రం రాళ్ళతో చంపమంటుంది మరి
ఈమెను ఏం చేయమంటావ్ "-అని అడిగారు

4.
నేను ఆయన వైపు చూసా
ఆయన నా కళ్ళలోకి చూసాడు
నేను ఇవే నా చివరి క్షణాలని లెక్కించు కుంటున్నా
అప్పటికి ఆయన ఏం మాట్లాడలేదు
వంగి నేల మీద వేలుతో ఏవో రాస్తూన్నాడు

5.
పరిశుద్ధులనుకుని రాళ్ళు పట్టుకున్న చేతులవి చదివి
ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి
-"మీలో పాపం చేయని వాడు
మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు "
అలాగే నేల మీద రాస్తున్నాడు
కొద్ది సేపటికి అక్కడ ఎవ్వరు లేరు

6.
"అమ్మా " అని ఆయన నన్ను పిలిచాడు
పాపత్మురాలిగా నిలబడ్డ నాకు ఒక నిమిషం ఆ పిలుపుతో
ప్రక్షాళన జరిగింది
గుండెలో ఆయన కరుణ సింహాసనం వేసుకుంది
ఆ దయ గల మాటలు
నాకు నిజమైన ప్రేమ ఇదని చూపించాయి
లోకులకు , దైవానికి మధ్య వ్యత్యాసాన్ని చూపాయి

7.
ఇక
అప్పట్నుంచి ఎవరు నన్ను
పిలిచినా
ఆయన మాటలే చెప్తాను
నా యేసుని మాటలే చెప్తాను

8.
లోకంతో నాకు ఇక పని లేదు
ఈ వేషధారణతో/వేషదారులతో పని లేదు
అతిపరిశుద్దులనబడే వారితో పని లేదు
నేను రక్షించ బడ్డ పాపిని
ఇప్పుడు ఎప్పుడు ఆయన పాదాల దగ్గర
చోటు దక్కించుకున్న పాపిని -
--------- by Mercy Margaret (29/12/2012)---

|| మానవుల మధ్యకు మానవుడై || by Mercy Margaret
-----------------------------------------
ఆదియందు వాక్యం ఉంది
వాక్యం దేవునితో ఉంది
వాక్యమే దేవుడైయండి

కాలము సంపూర్ణమైనప్పుడు
లేఖనాలలోని ప్రవచనాల నెరవేర్పు కోసం
శరీరధారియై
మానవుల మధ్యకు మానవుడై

పాపం చేసి కోల్పోయిన మహిమను
తిరిగివ్వడానికి
లోకపాపాలన్నీ మోసుకు పోయే దేవుని గొర్రెపిల్లగా
సాత్వికంగా దిగొచ్చింది

ఇమ్మానుయేలుగ నీతో నాతో ఉండడానికి
దైవం దిగొచ్చింది
------------------------ by mercy margaret (25/12/2012)----

|| క్రీస్తు జన్మదినం || by Mercy Margaret
-------------------------------------------------
సమయం వచ్చింది 
చీకటి దాక్కోడానికి 
దేవునికి నరునికి మధ్య తెర చినగడానికి 
ప్రవచనాల నేరవేర్పుకు నాంది పలకడానికి 

పరమ సింహాసనం వదిలి
దైవం
రక్త మాంసాలు గల దేహం కోసం
జన్మపాపం కూడా అంటకుండా
కన్య గర్భంలో ప్రవేశించాడు

దైవానికి నరునికి మధ్య
ఏదేను తోటలో ఏర్పడ్డ అగాధం పూడ్చడానికి
కుమారుడు
తానే వంతెనగా మారడానికి దిగివచ్చాడు

తండ్రి కుమారుని చూసి గర్వపడుతున్నాడు
సృష్టి కర్తను పసిబాలునిగా చూసి
ఆకాశం కొత్త చుక్కతో నవ్వింది
తూరుపు దేశ జ్ఞానులతో సహా
యావత్ ప్రపంచానికి
ప్రపంచ నడిబొడ్డు వైపుకు కు దారులు వేసింది

పాపపు కటిక చీకటి హృదయాలను కమ్మి
వెలుగును సైతం మింగే సమయం
వెలుగు శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణుడుగ
ఇల కేతేంచి పాపాన్ని సాతానును
ఓడించబోయే రోజుకు తొలిమెట్టు పడినదినం

రక్షకుడు అరుణోదయ దర్శనంగా అవతరించినదినం
భూమిపైన ప్రజలందరికి వినిపించబడిన సంతోషకరమైన
సువర్తమానం
-" మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు
ఈయనే ప్రభువైన క్రీస్తు "......
ఇదే ఇదే క్రిస్మస్ పండుగదినం

క్రీస్తు జన్మదినం
కృపాసత్య సంపూర్ణుడికి ఆరాధనోత్సవం ♥
--------------- by mercy margaret (25/12/2012)-