Sunday, April 14, 2013

|| ప్రార్థన మందిరం || by Mercy Margaret
----------------------
యేసు - "నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను ....."
ఒక్కసారి ఇదే మాటను 
ఆకాశం నుంచి వినిపించేలా ఘర్జించయా .. 
అప్పుడైనా మా వెన్నులో ఒణుకు పుట్టి 
నీ వైపు కనులెత్తుతామ్ 

ఒక సారి సంఘాల పునాదులు దద్దరిల్ల జేయయా
చిన్నల మొదలుకొని పెద్దల వరకు 
వినయ మనస్కులమై నీలా మారేందుకు
అహానికి సిలువేస్తాం

ఒక్కసారి మా కళ్ళను నీ రక్తంలో ముంచయా
నీ దేహం మా కోసం మోసిన
పాపాల్ని చూసి సిగ్గుపడతాం

నీ రక్తం కార్చగా కట్టిన సంఘాలపై
నీ ఆత్మాగ్ని కురిపించు
ఆరిపోయిన మా ఆత్మ దీపాలు వెలిగించుకుంటాం
బుద్దిగల కన్యకల్లో ఒకరమవుతాం ....
---------------- (15-4-2013)---------

Saturday, April 13, 2013

|| తన నవ్వులో దాగి || by mercy margaret
--------------------------------------------------
ఎలా శిక్షించానో చూడు అని లోకం నవ్వుతుంది 
భలేగా జరిగిందే అని లోకులు నవ్వుతున్నారు 

హలో.....!!అని 
ఆకాశ మహాకాశాల పైగా ఆయన 
వాళ్ళందరిని పిలిచి పిచ్చివాళ్ళారా అని 
ఒక నవ్వు నవ్వాడు అంతే 

ఇంకేముంది
ఆయన సార్వభౌమత్వం కన్నా గోప్పదేముందని
నేను నా పరిస్థితులను చూసి చులకనగా నవ్వి
ఆయన నవ్వులో దాక్కున్నా
అంతే

వెక్కిరింతగా నా చుట్టూ చీకటి రాల్చిన నలుపు
ఆయన నవ్వుకు భయపడి పరుగెత్తింది
ఏడ్చి ఏడ్చి దెబ్బ తిన్న కంటి నరాలలోకి
జీవం పొంగి కొత్త దృష్టితో ఆయనను చూసేలా చేసింది

చాలు ఈ ధైర్యం
ఇప్పుడు లోకం/అబద్ధానికి జనకుడు నా కాళ్ళ కింద
నేను నా క్రీస్తుతో తన నవ్వులోని అణువణువులో
వెలుగుతూ "నా ప్రాణంతో" చేయి పట్టుకుని ఎగిరే
సీతాకోక చిలుక ..!!
-------------- (12/4/2013)-------

Wednesday, March 6, 2013

Assurence 
-------------

జారి పోతుందేమో బొట్టు బొట్టుగా 
నా దోసిలిలో ఉంటే జీవితం 
అందుకే నీ దోసిలిలోనే ఉండనివ్వు 

నేను లాక్కోడానికి ప్రయత్నించి 
అప్పుడప్పుడు నిన్ను విసిగించినా 
నా మీద జాలిపడకు 
నీకు అసలే దయాదాక్షిణ్యం , కరుణాజాలి ఎక్కువ 
దీర్ఘశాంతం గురించి చెప్పక్కర్నే లేదు

నీ చేతుల్లోనే ఉండి  కిందకు చూస్తూ 
నా కళ్ళు కింద ఉన్న వాటి గురించి ఆశించొచ్చు సుమా 
ఒకవేళ అలా చూసినా నువ్వు నన్ను దగ్గరగానే 
హత్తుకుంటావ్ ఎందుకంటే నువ్వు 
నా యేసువు  కదా !!

మనుషుల చేతిలో పడేకన్నా 
నేను నీ చేతుల్లో పడడం మేలు కదూ 
భయం పిరికితనం నిన్ను నా కళ్ళకు చిన్నగా 
చూపించే ప్రయత్నం చేసేప్పుడు 
నా హృదయపు కళ్ళను , నా విశ్వాసపు చెవులను 
పెద్దగా తెరువు 
అయినా నీ ముందు నిలిచే సత్తా ఎవరికుందిలే ?
దూళి అణువంత ఈ విశ్వం నీ సృష్టిలో 
అందులో నేను నాపై రాళ్ళు వేసే వాళ్ళు ఎంతలే ?

|| ఆయన పాదాలు ముద్దాడా !! ||by Mercy Margaret
----------------------------------------
నేను ముద్దు పెట్టుకున్నాను
అవును నేను ముద్దుపెట్టుకున్నాను
ఆయన పాదాలు
పరిసయుడైన సీమోను ఇంట్లో

అందరు చూసే వెలిచూపులను దాటుకుని
సమూహం మధ్యలోంచి దారి చేసుకుని
ఆ ఇంట్లోకి వెళ్తుంటే
ఎన్ని గుస గుసలో నా గురించి
ఎన్ని తీర్పులో వారి స్వనీతి పెదవులనుంచి

వెనక నుండి భోజనానికై కూర్చున్న
ఆయన పాదాల్ని చూసి ముట్టుకోగానే
మురికికూపమైన హృదయంలో శుద్ధీకరణ,
పశ్చాత్తాపపు కొలిమిలో కాల్చబడుతున్నట్టు హృదయం
కడగబడుతున్న ఆలోచనలు కన్నీరే దానికి సాక్ష్యం
ఆగకుండా కన్నీరు .... ఆయన పాదాలపై ప్రవహిస్తూ తడుపుతూ

ఆయన తప్ప అక్కడున్న వారి
చూపులు మాటల , ప్రశ్నల సందేహాల
కొక్కాలు, కొరడాలు నాపై జులుం చేస్తున్నా
నా ముందున్న రక్షణ , నా నిరీక్షణ నన్ను
చీకటి లోంచి వెలుగువైపు దాటిస్తున్నట్టు౦టే
సమాధానం , విడుదల విస్తార జలప్రావాహంలా నన్ను ముంచేస్తుంటే
నాకు ఆయన పాదాలు మాటలు తప్ప ఏమి కనిపించవు విన్పించలేవే!!

నా కన్నీటితో పాదాలు కడిగి
తల వెంట్రుకలతో తన పాదాలు తుడిచి
ఆయన పాదాలు ముద్దు పెట్టుకుని
ఇంతవరకు నావైపు ఆకర్షించేందుకు వాడిన అత్తరు మొత్తం
నాకింకవసరం లేదని ఆయన పాదాలకు పూసా

ఆయన నా విశ్వాసాన్ని ఘనపరిచాడు
నా హృదయాన్ని సమాదానపు ఊటలతో క్రొత్తగా చేసి
నన్ను నన్నుగానే స్వీకరించి
పాపాత్మురాలని నన్ను తరిమే మాటలనుంచి నాకు విముక్తినిచ్చి
యేసు అనే తన పేరుని
నా జీవితంలో యదార్ధం చేసాడు.
--------------------------- (27/2/2013)---------
 

Sunday, February 10, 2013

‎||దేవుడు గీసిన నా ప్రణాళిక || by Mercy Margaret 
----------------------------------------------------
నేను 
తన రెక్కల నీడలో దాగినప్పుడు 
ఏ గ్రద్ద నా కోసం చూస్తేనేమి ?
ఏ పాము నన్ను మ్రింగాలని తిరగాడితే నేమి ? 

ప్రశ్నల ఉరిబిగించి గొంతును కోసి 
పొడిచి పొడిచి 
నా రక్తాన్ని పరిశుద్ధమా ?? అపరిశుద్ధమా ? అని 
పరిక్షిమ్చాలని చూస్తే 
హేబెలు రక్తం మొరపెట్టినట్లు 
భూమిలో నుంచి కూడా 
నిస్పక్షపాతి అయిన దేవుని న్యాయం చేయాలని 
అడగడం మానలేను కదా 

ఇంతకు 
నీ భాద ?
నా ఆత్మ గురించా ? లేక 
దేవుని చిత్తం తప్పు అని నిరూపించి ఓడిపోవడం గురించా ?
నా అడుగులు ఇంకా ఆయన బండపైన స్థిరంగా ఉన్నాయి ఏమిటని 
అలజడి రేగుతున్న నీ హృదయాన్ని ఎలా నిమ్మళింప చేయాలనా ?
జీవమిచ్చిన దేవుడు గీసిన నా ప్రణాళిక నీకు రుచించక పొతే 
నేనేం చేయాలి ??

పర్లేదు 
నీలాంటి వాళ్ళు నాకు అవసరమే 
ఇంకా ఇంకా దగ్గరగా యేసును చూడడానికి 
నాకు అవకాశం ఇస్తున్నావ్ !!

శోదింప బడిన మీదట 
నేను సువర్ణంగా మారుతూ 
నీకు కృతజ్ఞత చెబుతాలే 
నేను సువర్ణం అవడానికి నువ్వు పూనుకోవడం 
గుర్తు చేసుకుని 
రెండు మాటలు నీ గురించి దేవునికి కూడా 
విన్నవిస్తాలే !!
-------------------------( 10/2/2013 )---------

Wednesday, February 6, 2013


||ఒక్కసారి ఆగు || by mercy margaret
---------------------------------------------
1.
ఎందుకు నడవడం ??
దుష్టుల ఆలోచనల ప్రకారం
ఎందుకు నిలబడడం ??
పాపులు వెళ్ళే ఆ మార్గంలో
ఎందుకు కూర్చోవడం ??
అపహాసకులు ఎగతాళి చేసే వాళ్ళు కూర్చుని
పారించే ఆ మురికి స్థలాల్లో
ఎంత ఆనందం వస్తుందని ?
ఎంతటి హాయి నీ హృదయాన్ని నింపుతుందని ??

2.
అహోరాత్రము
దేవుని లేఖనాలను , వాక్యాన్ని , ధర్మశాస్త్రాన్ని
పఠించి , ధ్యానించి
దానిలో ఆనందించు
అప్పుడు నీవు ధన్యుడవవుతావ్

3.
ధన్యుడవుగా
ఆ ధన్యత ఎలా ఉంటుందో తెలుసా ??
నీటి కాలువ ప్రక్కనే నాటబడి
ఎప్పుడూ పచ్చగా వాడిపోని ఆకులతో ,
ఏ కాలపు పండ్లు ఆ కాలంలో కాస్తూ
అన్ని పనుల్లో సఫలత పొందే
చెట్టులా

4.
కాని
దుష్టుడు ??
పొట్టులా
గాలికి చెదరగొట్ట బడే వాడిలా ఉంటాడు

5.
వీళ్ళకు
న్యాయవిమర్శలో నిలవలేరు
నీతిమంతుల కోసం నిర్దేశించబడ్డ సభలో
పాపులకు చోటు లేదు

6.
గుర్తుంచుకో
నీతి మార్గంలో నడిచే వారిగురించి యెహోవాకు తెలుసు
అలాగే
దుష్టత్వపు మార్గంలో నాశనానికి వెళ్ళే వారిగురుంచి కూడా ..
-------------------------------------------------------
(" ఒకటవ (1)కీర్తన " మూలం )
-------------------------------------------------------
 

Wednesday, January 9, 2013

||పాతవి గతించి సమస్తం కొత్తవవుతాయి || by mercy margaret 
---------------------------------------------
కలలన్నీ చింపి చుట్ట చుట్టి 
విసిరి కొడ్తున్నందుకు 
గోడలనిండా మరకలే ..

పాడై పగుళ్లతో
కాలిపోయిన గోడలతో
కలలను చంపిన మరకలతో
ప్రేమ అడుగంటి , మోసపు అడుగుల మరకలతో
ఒంటరితనపు సాలె గూళ్ళు
అల్లుకుని '
అసహ్యంగా ఉన్న నా హృదయపు ఇంట్లో
ఒక్క దాన్నే తిరుగుతున్నప్పుడు

బయట ఎవరో అరుస్తున్నారు
"ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి
పాతవి గతించి సమస్తం కొత్తవవుతాయి " అని

నవ్వుకున్నాను
యిలా ఉండడం అలవాటైయిందిగా

* * *
ఎప్పటినుంచో నా హృదయతలుపు
తడుతున్న శబ్దం
అసహనంగానే తీసా

ఎదురుగా ఆయన
తల మీద ముళ్ళ కిరీటం
వంటి నిండా గాయాలు
నాకు నీ హృదయం కావాలి ఉండటానికి ఇస్తావా ?? అడిగాడు
చెడిపోయిన ఇళ్ళని , పనికి రాని చోటని ,
అసహ్యాన్ని హృదయంపై చిమ్మి ఉమ్మి
వెళ్ళిన వారే అందరు
ఈయనెవరు ?? ఈ పాడయ్యిందే కావాలంటున్నాడని
సరే రమ్మన్నాను

అంతే
ఆయన అడుగుపెట్టిన క్షణం నా హృదయం నూతనత్వంతో
తన్మయత్వం చెందింధీ
మళ్ళీ కొత్తదైన పరిమళంతో గుభాలింపులు నింపుకుని
ప్రేమ చిగురులు వేసి చీకటి పారి పోయింది

ఇప్పుడు నేను ఆయనతో రోజు కలిసి భోజనం చేస్తూ
అడిగిన వారికి చెపుతుంటాను ఆయనెవ్వరు?? అంటే

పనికి రావని విసిరి కొట్టిన వాటిని బాగు చేసే ఇంజనీరని