
-------------
జారి పోతుందేమో బొట్టు బొట్టుగా
నా దోసిలిలో ఉంటే జీవితం
అందుకే నీ దోసిలిలోనే ఉండనివ్వు
నేను లాక్కోడానికి ప్రయత్నించి
అప్పుడప్పుడు నిన్ను విసిగించినా
నా మీద జాలిపడకు
నీకు అసలే దయాదాక్షిణ్యం , కరుణాజాలి ఎక్కువ
దీర్ఘశాంతం గురించి చెప్పక్కర్నే లేదు
నీ చేతుల్లోనే ఉండి కిందకు చూస్తూ
నా కళ్ళు కింద ఉన్న వాటి గురించి ఆశించొచ్చు సుమా
ఒకవేళ అలా చూసినా నువ్వు నన్ను దగ్గరగానే
హత్తుకుంటావ్ ఎందుకంటే నువ్వు
నా యేసువు కదా !!
మనుషుల చేతిలో పడేకన్నా
నేను నీ చేతుల్లో పడడం మేలు కదూ
భయం పిరికితనం నిన్ను నా కళ్ళకు చిన్నగా
చూపించే ప్రయత్నం చేసేప్పుడు
నా హృదయపు కళ్ళను , నా విశ్వాసపు చెవులను
పెద్దగా తెరువు
అయినా నీ ముందు నిలిచే సత్తా ఎవరికుందిలే ?
దూళి అణువంత ఈ విశ్వం నీ సృష్టిలో
అందులో నేను నాపై రాళ్ళు వేసే వాళ్ళు ఎంతలే ?