Saturday, July 28, 2012

నాకు ఒక శవం ఎదురైంది 
మాట్లాడుతుంది
నడుస్తుంది
శ్వాసిస్తుంది 
నవ్వుతుంది 
ఏడుస్తుంది
కాని అదంతా జీవం లేక
ఎండిపోయిన చెట్టు చేస్తున్న
ఆర్భాటం లాగే అనిపించింది

అడిగా దాన్ని
నువ్వు శవం ఎలా అయ్యావ్ అని ?
తలదించుకొని
నా పేరు సార్ధీస్ సంఘం అంది

నీ కధేంటి ?
అని అడిగా

-"నేను తెల్లని వస్త్రాలు ధరించుకోలేదు
నా పనులు ప్రభువు యెదుట సరిగా కనబడలేదు
విన్న ఉపదేశాన్ని మనస్కరించి అనుసరించేలేదు
ఆయన కోసం జాగరూకతతో ఎదురుచూడలేదని
యోహానుతో వ్రాయించాడు

ఇదో
అప్పటి నుంచి ఇలా
బ్రతికే ఉన్నా చచ్చిన దానిలా
చావనైయున్న మిగిలిన వారిని ప్రభువైపుకు
నడపాలని
దొంగలాగ వచ్చి నన్ను నిలదీసినట్టే
మీ అందరిని నిలదీసే రోజు ఒకటుందని
ఉదాహరణగా తిరుగుతున్నా

జయించిన వానికి జీవకిరీటం
ఇచ్చి
జీవగ్రంధంలో పేరు తుడవక
దూతల యెదుట ఒప్పుకొని
హత్తుకుంటానికి
ఆయన దినమెల్ల చేతులు చాచి
ఎదురు చూస్తున్నాడని
అందరికి చెపుతూ తిరుగుతున్నా

నాకు మళ్ళీ చిగురించే రోజు ఉందని
ఆయన నీటి ఓరన నన్ను నాటి
ఫలించే కొమ్మగా
ఆయన సన్నిధిలొ దివారత్రులుండి
నన్ను నేను సజీవ సాక్షిగా ..
మార్చుకుంటానని కన్నీళ్లు
విడుస్తుంది --"

ఆ శవం రూపంతరం చెందాలని కోరుతూ
నువ్వెలా ఉన్నవాని
ఒక ప్రశ్న నా ముందు సవాలుగా
ఉంచుతూ...నా స్థితి నాకు
చూపిస్తుంది
(జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కాని నీవు మృతుడవే ప్రకటన 3:1-7)
♥(By-Mercy Margaret (28/7/2012)♥

No comments:

Post a Comment