Friday, November 8, 2013

వస్తావా నేస్తం ..!
________________
కొంత మనశ్శాంతి పంపుమందాం శాంతమూర్తిని 

ఎలియా వద్దకు పంపిన కాకితో  మన  కోసం 

ఎక్కడో రాజుకున్న నిప్పు అడవిని తగులబెడుతున్నప్పుడు  
అరణ్యంలో ఆడుకునే 
చిన్ని చిన్ని ఉడతలు కుందేళ్ళు 
చెంగున గెంతే  లేళ్ళు 
ఆ విహ్వలజాలాల ప్రతాపానికి బలి కాక ముందే 
ఓ మేఘం నిండా శాంతిని నింపి మన హృదయారణ్య౦లో 
కురిపించమని వేడుదాం 

తండ్రికి చిక్కకుండా  దాచి చివరి వీడ్కోలు పలికిన
యోనాతాను 
దావీదుతో  పలికిన మాటలు విన్న 
అక్కడి  చెట్లు కొండల వద్దకెళ్ళి 
యదార్ధ  స్నేహపు పలకరింపుల 
తడి తెలుసుకుని వద్దాం 

నుదుటి మీద ముద్దు పెట్టి అప్పగించినా  
అకేల్దమలో యూదా రక్తం ఏమని రోదిస్తుందో 
రుజువులడిగివద్దాం 

వస్తావా.. నేస్తం ... 

క్రిస్టమస్ కోసం సిద్ధపడుతు 
క్రీస్తుని మనసులో నింపుకుందాం
పశుశాలలో వెలిగిన చిరునవ్వులను దోసిలిలో 
పట్టుకుని 
గాయమైన హృదయానికి లేపనంగా రాసుకుందాం  

No comments:

Post a Comment