Monday, November 18, 2013

||నదిని అన్వేషిస్తూ || by Mercy Margaret
___________________________________
ఒక నది ఇక్కడ ప్రవహిస్తూ ఎప్పుడు పచ్చదనాన్ని కంటూ ఉండేది.
నదినానుకుని నేల, నేల నుండి వేళ్ళు పాకి అడవి, అడవిలో ఆణువణువూ చెట్లు చేమలు
పక్షులు,పశువులు. నిత్యం నూత్న కోలాహలం పచ్చపచ్చగా వినవస్తూ ఉండేది.
చెట్లు పైపైకి పెరిగి ఆకాశంతో అల్లుకుపోయే పందిళ్లను వేసి మేఘాలను కదలకుండా బంధించి
వర్షంతో అందమైన స్నేహం చేసేవి.

నాకిప్పుడు దాహమేస్తుంది . తాగడానికి నీళ్ళు కావాలి. నదిని ఎండిపోజేసిన 
విషవాక్యాలను శపిస్తున్నాను. నది ని ఎడారిగా చేసిన ఆలోచనల రాతలను బహిష్కరిస్తున్నాను.
జీవం ఉట్టిపడే నది కోసం నేను అడవి దాటి అన్వేషిస్తున్నాను.

అడవిలో ఎండిపోతున్న చెట్ల ఆత్మలను దోసిట్లో పట్టుకుని బయలుదేరాను..
విషం చిందించిన అక్షరాలూ క్షరమైయ్యేట్టుచేసే
విషం దొరికే తావు ఎక్కడుందని వెళ్తున్నాను. ఈ అడవిని ఇక్కడే ఒదిలి
నదిని వెతుక్కుంటూ మళ్ళీ పచ్చగా పాలు తేనెలు ప్రవహించే తావులున్న
నదికోసం జీవనది కోసం వెళ్తున్నాను.
నా నీళ్ళు తాగువాడు మరెప్పటికీ దప్పిగొనడన్న నది కోసం వెళ్తున్నాను.

కృష్ణ, గోదావరి తుంగభద్రలు దాటి. గంగా సింధు బ్రహ్మపుత్రలు దాటి.
అమెజాన్, నైలు, మిస్ససిపి నదులు దాటి. సిక్క్వే రెడ్ వుడ్ ,జాగ్ ఫాల్స్ అడవులు దాటి.
మహాగ్రంధాలు, ఉద్గ్రంధాలు దాటి, ఆదియందు ఉన్న వాక్యం వినబడుతున్న శబ్దం వైపు,
కలుగునుగాక అన్న మాటవైపు. భూమి నిరాకారంగా శూన్యంగా ఉండి చీకటి అగాధ జలములపై కమ్మిఉన్నప్పుడు,ఆ జలముల మీద ఆ నది ఆత్మ అల్లాడుచున్న స్థలానికి

నీటి వాగుల కొరకు తృష్ణగొన్న దుప్పినై ..
__________________________


No comments:

Post a Comment