Sunday, October 14, 2012

కోడి కూత -కడ బూర
---------------------
కోడి కూసింది
ఆయన చెప్పినట్టే
తనలో ఇంకా అపనమ్మకం బ్రతికే ఉందని
ఏదో  భ్రమ అతని చుట్టుకొని భయంతో కలిసి చిక్కగా ఆ కళ్ళకి
లేపనమై
యధార్ధతని చూడనివ్వక
జరగబోతున్నచారిత్రక సంఘటనలో తానూ ఒక భాగమవుతుంటే
సూచనాత్మక పాఠాన్నినేర్పుతూ

కోడి కూసింది
నామకార్ధపు శిష్యరికం చేసావా ?అని చెంప మీద కొట్టినట్టు
ఇంకా రక్షకుని గూర్చి పూర్తిగా తెలుసుకోలేదా అని
సత్యపు కత్తితో ప్రశ్నల పోట్లు పొడుస్తున్నట్టు
అధ్బుతాలు చూసిన కళ్ళు ఇంకా బొంకడం మానేయమంటూ
కన్నీళ్ళతో హృదయం కడుక్కోమని ఆగకుండా ప్రవాహమై
ఉప్పొంగుతుంటే
ఆ కూత ఏదో కొత్త పాఠమే నేర్పుతూ

కోడి కూసింది 
యేసును సృష్టి కర్తగా ఒప్పుకుంటూ
-"ఇంకా గ్రహించని ఓ మనిషి నీ కన్నా నేనే నయమని "
కర్తవ్యాన్ని , ఉద్దేశ్యాన్ని మర్చిపోయిన  నీకు
గుర్తుచేసేందుకు ప్రభువు నాకు పురమాయించాడని

కోడి కూసింది
ఇక ఇదే  నీకు అబద్దాలకి చివరి రోజని
సత్యానికి నీకు అన్యోన్య సహవాసం మొదలని
ఒప్పుకోబోయే నీ ప్రతి అవిదేయతకు నేను ప్రత్యక్ష సాక్షి అని

కోడి కూసింది 
ప్రభు ప్రేమ ఇంకా నీపై ఎక్కువయింది చూడు అని
ఆ సిలువపై ప్రాణం పెట్టబోతున్నాడు
త్వరపడమని ఆర్ధతతో

నిన్ను మెల్లని  స్వరం అడుగుతుంది
అప్పుడు కోడి కూతతో సరిపోయింది  కాని
నేడు కడ బూరశబ్దం వినగలిగే ధైర్యం
నీకుందా అని
------------- by mercy margaret (14/0/2012)----------------------



No comments:

Post a Comment