Saturday, October 6, 2012

మెర్సి మార్గరెట్ II పనికి రానని త్రోసేయకు II
----------------------------------------------------
ఇన్ని రోజులు నిన్ను పట్టించుకోలేదు
ఏమనుకోవద్దూ..!!
ఎంటో శరీరం సుఖాన్ని అడిగింది

తీరుస్తూ వస్తున్నా

కాలి గోటికి దెబ్బ తగిలితే కంటిని పిలిచేది నొప్పి
నచ్చిన వస్త్రాలు చూసి
కప్పమనేది మేను
వాసన చూడగానే ముక్కు
నింపమనేది కడుపు
దేవుడి ముందు నిల్చుని జోడించిన చేతులు ,మోకరించి కాళ్లు
ఎలాగైనా చేసి దేహమంతా
ఆపమనేది వయసు

ఏం చేయాలి చెప్పు??
ఆకరం మారింది శరీరానిది
ఎన్ని లేపనాలు రాస్తేనేం?
ఎన్ని సబ్బులు ఒంటికి రుద్దితే నేం ?
వణుకుతున్న ఒంటిని చూసి ఇప్పుడు
నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా
వదలాల్సిందే దేహం
మట్టే కదా అని..?!

లోలోపల నువ్వు నన్ను అప్పుడప్పుడు
గద్దిస్తూనే ఉన్నావ్..
ప్రేమిస్తూనే ఉన్నావ్ ..
బుద్ది చెప్తూనే వున్నవ్ ..
మందలిస్తూ మార్గం ఇది కాదని చెప్తూనే ఉన్నావ్ ..

తోడుతూ ఉంటే చెలమలా క్రొత్తగా ఊరుతూ
నన్ను నాకు పరిచయం చేసే వాడివి
కాని ఆ నిశ్చలమైన స్థితి ఇప్పుడు క్రొత్తగా ప్రభోధ చెయమని
నీ కాళ్ల దగ్గరికొచ్చా
ఇంకా ఎంత సమయం మిగిలుందో?

సుఖ దు:ఖాల కుండలు పగలగొట్టి
అవి కూడా మట్టే అని తెలిసి
లొకంలో ఉన్నదంతా
నేత్రాశ,శరీరాశ ,జీవపు డంబం అని ఇప్పుడు అర్దమవుతుంటే
కరిగిన నేను ఇప్పుడు నేలపై పరుచుకుని ఇంకిపోతుంటే
నేల తిరిగిరా అని పిలుస్తూ నవ్వుతుంటే
వింటున్నా

" సిగ్గేస్తుంది "అనే మాటకి ఇప్పుడే అర్దం తెలిసింది
ఇప్పుడైనా కొంచెం బుద్ధినిస్తావా..
వివేచనతో కలిపి తలకి అంటుకుంటా
ఆజ్ఞలు చేతికి కట్టుకుంటా
మసక తుడిచిన కళ్లతో నిన్నే చూస్తూ
నీపాదాల దగ్గరే కూర్చుంటా
పనికి రానని త్రోసేయకు..ప్రాధేయపడుతున్నా...
----- by Mercy Margaret (6/10/2012)-----------------
-

No comments:

Post a Comment