Wednesday, December 19, 2012

|| క్రిస్మస్ అనగానే || by Mercy Margaret
---------------------
క్రిస్మస్ అనగానే 
ఏం గుర్తొస్తుంది ??

నాలో నిండిన చీకటిని 
ఒక చిరు నవ్వుతో చీల్చేసి
పసి బాలుడిగా
పశుశాలలో పవళించిన
నా యేసు నాధుని
బోసినవ్వుల సూర్య కాంతి

ఎండిన మొద్దుకు చిగుర్లు మొలకెత్తిస్తూ
ఆకాశంనిండా కొత్త నక్షత్ర కాంతి నింపి
ఆకాశాన్నీ భూమిని మళ్ళీ నవ్విస్తూ
జోల పాట వినిపించే తన చూపుల కరుణ వర్షం

క్రిస్మస్ అనగానే
ఏం గుర్తొస్తుంది ??

హృదయంలో ఎండిపోయిన నదులు
తిరిగి ప్రవహింప జేసేందుకు
కడుపులో మళ్ళీ జీవ జలం
పుట్టింపవచ్చిన
సమాదానమైన జీవపు ఊట

తలనుండి అరికాలు వరకు
పచ్చిపుండ్లతో నిండిన నా శరీరాన్ని
స్వస్థపరచడానికి దెబ్బలకు సిద్ధపడ్డ
పరమ నిబంధనకై దిగివచ్చి
దేహం గా మారిన వాక్యం

క్రిస్మస్ అనగానే
ఏం గుర్తొస్తుంది ??

పాపపు జిగటగుంటలో పడి
కాళ్ళు బయటికి తీయలేని స్థితిలో ఉన్న నాకోసం
అనంతమైన ప్రేమతో తన సొగసుని సురూపాన్ని
ధారాబోసి
సిలువకెక్కి మరణించిన ప్రేమ

నను
తన పరిమళ వాసనగా చేయాలని
తానే దహనబలిగా యాగమైన
యేసుని కృప గుర్తొస్తుంది
పడిపోయిన క్షణాలని తిరిగి నిర్మిస్తా రమ్మంటూ
తను ప్రేమతో పిలిచే మెల్లని స్వరం గుర్తొస్తుంది
----------------- ( 19/12/2012 ) by mercy margaret -------

No comments:

Post a Comment