Saturday, December 8, 2012

ll నా పౌర స్థితి ll  by  mercy  margaret 
-----------------------------------------
నమ్ముతున్నా
నా దినములన్ని
ఆయన గ్రంధములో వ్రాయబడి ఉన్నవని 
ఈ లోకంలో నేను పరదేశినని
నా పౌర స్థితి పరలోకమందున్నదని
 ఇక్కడ నే  కేవలం యాత్రికురాలినని

నిర్ణయింపబడిన దినములు ముగిసిన రోజున

నా కళ్ళు మూయబడతాయని 
నా నాసికా రంద్రములగుండా ఊదిన ఆయన ఆత్మ
ఈ దేహపు గుడారాన్ని విడిచి బయటకొస్తుందని 

నేను లేని దేహాన్ని చూస్తూ

నా వాళ్ళు అనబడే వాళ్ళందరూ , కాని వాళ్ళు కూడా
ఆ దేహాలలో ఉండే ఏడుస్తుండగ 
మట్టికి మట్టై పోయే ఈ దేహాన్ని నేను మరి వింతగా 
చూస్తూ 
నేను ఎవరో అప్పుడు ఇంకా స్పష్టంగా తెలుసుకుంటానని 
దేవుని ఉద్దేశ్యం ఎలా నెరవేరిందో బేరీజు వేసుకుంటానని  

అందమైన పూలను

వదిలిన నా  డొల్ల శరీరంపై పెడతుంటే చూసి నవ్వుకుంటానని 
వెతికి వెతికి నా ఊసులన్ని చెప్పుకుంటూ
మాట్లాడుకుంటూ రోదిస్తుంటే 
నా పరమ తండ్రితో ఉండే సమయం వచ్చిందని నేను 
ఆనందిస్తానని 

ఆత్మీయ సత్యాలన్నీ తెలుపబడుతుంటే 

ఆశ్చర్య పోతానని 
నా దినములు లిక్కించుటకు  నాకు నేర్పుమని 
దావీదు 
ఎందుకన్నాడో ఇంకా బాగా అర్ధం చేసుకుంటానని 

పరదైసు వైపుకు  వెళుతూ  

భూమిని  చూస్తూ వింత వింత అనుభూతి పొందుతానని 
నా కన్నా ముందు చేరిన  వారితో 
పరలోక సత్యాలు, ఆత్మీయ లోతులు తరచి తరచి తెలుసుకుంటానని 

ఆహా ఆహా 


మేఘారూడుడై  రానున్న ప్రభువు నేదుర్కోనుట ఇంకెంత 
ధన్యతో కదా !
నాధ  ఇంకెన్నాళ్ళు అని హతసాక్షులైన పరిశుద్దుల  స్వరంతో 
స్వరం కలపడంకన్నా గొప్ప భాగ్యం ఏముంది కదా ?

ఆ అనుభవాలకై హృదయం ఎదురుచూడటం 
బహు బాగుంది  కదా..!? 

నా మనసా యెహోవాను సన్నుతించు 

నా అంతరంగమందున్న సమస్తమా ఆయన 
నామాన్ని స్తుతించు ..!!


------------------------- (8/12/12)-------------------

No comments:

Post a Comment