Wednesday, December 19, 2012

లోక సంద్రంలో దిక్కు తెలియక 
ముంచెత్తుతున్న అలలకు, గాఢాంధకారానికి  భయపడి 
అయ్యా అని పిలవగానే 
శరీరధారియై సహాయానికొచ్చిన 
దైవం వాక్యం 

ఎండి  రాలిన  ఆశల ఆకులు కొట్టుకుపోతుంటే  
చిగురులు వేయలేక కృంగుతుంటే 
తనలో అంటుకట్టుకున్న
ద్రాక్షావల్లి వాక్యం 

అలసి సొమ్మసిల్లి 
ఆత్మ తృష్ణతో జీవానికై వెతుకుతుంటే  
పాపానికి బానిసైన బ్రతుకును విడిపించవచ్చి 
రక్తం ధారబోసి, సర్వాంగ కవచం స్వాతంత్ర్యం ఇచ్చిన 
రక్షణ వాక్యం  

కలుగును గాక అంటూ సృష్టిని చేసి 
సర్వం మంచిదనియెంచి సంతోషిస్తే ,
దారి తప్పిన మానవాళిని దయతో హత్తుకొనడానికి    
ఆకాశానికి భూమికి మధ్య ఎత్తబడిన ఇత్తడి సర్పంలా 
సిలువకెక్కి రక్షణనిచ్చిన 
ప్రేమ వాక్యం 

అడుగు అడుగున తోడుంటూ 
జిహ్వకు  జుంటి తేనెగా , సరి చేయు సుత్తెగా , 
తీర్చి దిద్దు అద్దంగా ,నా పాదాలకు దీపంగా 
మార్గమై సత్యమై జీవమై 
చీకటి నుండి వెలుగులోకి దాటింపగా వచ్చిన 
పరిశుద్ధ అగ్ని ,పరిశుద్ధ వర్షం  , రెండంచుల 
ఖడ్గం వాక్యం 

No comments:

Post a Comment